Congress: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలోని ఓ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ రోజు గాంధీ భవన్‌లో మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది.
హైదరాబాద్: గాంధీ భవన్‌లో ఈ రోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఉత్తేజంతో ఉన్న పార్టీ నేతలు పాల్గొన్న సమావేశం ఇది. సమావేశంలోనూ ఇదే దూకుడు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇందులో ఓ సంచలన తీర్మానం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీహెచ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
Also Read: TSRTC: ముదిరిన బిగ్ బాస్ పైత్యం.. ఆర్టీసీ పై అభిమానుల దాడి.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపునకు సహకరించిన అగ్రనేతలకూ ధన్యవాదాలు చెప్పారు. అలాగే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైనా చర్చ జరిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు పైనా చర్చించారు.
పీఏసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. మీడియాతో కన్వీనర్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు వివరించారు. గతంలో ఇందిరా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్ నుంచి ఇందిరా గాంధీ లోక్ సభకు పోటీ చేసిన సంగతి తెలిసిందే.