భోపాల్: మానవత్వం మరిచిపోయాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ముక్కుపచ్చలారని చిన్నారిపై మృగంలా ప్రవర్తించిన వ్యక్తికి ఉరి శిక్షే సరైందని కోర్టు భావించింది. మూడేళ్ల చిన్నారిని చిధిమేసిన ఆ కామాంధుడికి న్యాయస్థానం ఉరి శిక్షవిధించింది. ఈ ఏడాది జూలై 1న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ కామాంధుడికి మధ్యప్రదేశ్ సాట్నాలోని కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పనిచ్చింది. 

కామాంధుడి చేతిలో బలైన ఆ చిన్నారి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిన్నారి తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుర్తించడం విశేషమని జిల్లా ప్రాసిక్యూషన్ అధికారి గణేష్ ఫాండే తెలిపారు. నిందితుడు కుటుంబ సభ్యులకు ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు.
 
డీఎన్ఏ నివేదిక ఆధారంగా జిల్లా అదనపు జడ్జి డీకే శర్మ ఐపీసీ సెక్షన్ 376 ఏబీ కింద నిందితుడికి మరణశిక్షను ఖరారు చేశారు. అయితే గడిచిన ఏడు నెలల్లో మధ్య ప్రదేశ్‌లోని వివిధ కోర్టులు 13 మరణ శిక్షలు విధించాయి. అయితే మరణ శిక్ష విధించిన కేసులన్నీ మైనర్లపై జరిగిన దాడులే కావడం విశేషం.