కరోనా దెబ్బకు మహారాష్ట్ర చివురుటాకులా వణుకుతోంది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 52కి చేరుకోవడంతో ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. రాజధాని ముంబై సహా రాష్ట్రంలోని కీలక నగరాల్లోని దుకాణాలు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో 25 శాతం మంది మాత్రమే పనిచేయనున్నారు. మార్చి 31 వరకు ఈ ఆదేశాల్ని పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలతో పాటు అత్యవసర సేవలకు మాత్రం మనిహాయింపునిచ్చారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి సూచించారు.

Also Read:కరోనాతో మరొకరు మృతి: ఇండియాలో ఐదో మరణం

కరోనా మహమ్మారిని జయించాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మరోవైపు అన్ని విద్యాసంస్థలకు సెలవ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలన్నింటినీ రద్దు చేసి అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ఆమె వెల్లడించారు.

తొమ్మిది, పదో తరగతుల వారికి ఏప్రిల్ 15 తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని వర్షా స్పష్టం చేశారు. కాగా భారతదేశంలో కరోనా 20 రాష్ట్రాల్లోని 206 మందికి సోకింది. ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు.

Also Read:నల్గొండలో కలకలం: 14 మంది విదేశీయులు గాంధీకి తరలింపు

మార్చి 20వ తేదీ నాటికి 12,486 వ్యక్తుల నుంచి 14,376 శాంపిల్స్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. లిస్ట్‌లో మహారాష్ట్ర 52 కేసులతో అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానంలో కేరళ ఉంది.