లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు దేశంలో ప్రతి రోజూ జరుగుతున్నాయి. తాజాగా ముగ్గురు మహిళా వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ రహదారిపై గత రాత్రి ట్రక్కు బోల్తా పడడంతో వారు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు టైర్ పేలింది. దాంతో ట్రక్కు బోల్తా పడింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 

వలస కూలీల సమూహం ఒక్కటి నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరి ట్రక్కులో తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో ప్రమాదానికి గురైంది. గత పది రోజులుగా ఉపాధి కోల్పోయిన కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునే క్రమంలో 50 మంది మరణించారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారంనాడు రెండు ట్రక్కులు ఢీకొనడంతో 26 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనం సృష్టించింది.