న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో నాథూరాం గాడ్సే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. భోపాల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే అవి చాలదన్నట్లు మరింత రెచ్చగొట్టేలా కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి వ్యవహరించడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. 

నాథూరాం గాడ్సేపై సినీనటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు భోపాల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్  నాథూరాం గాడ్సే గొప్ప దేశ భక్తుడు. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలి. 

ఈ ఎన్నికల్లో అలాంటివారికి దీటైన జవాబు చెప్పాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలపై సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ వ్యహారం ఇంకా సద్దుమణగలేదు. 

ఇదిలా ఉంటే తాజాగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నళీన్ కుమార్ కాటిల్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. 

నాధూరాం గాడ్సే కేవలం గాంధీని మాత్రమే హత్య చేశాడు.. కసబ్ ముంబైలో విధ్వంసం సృష్టించి 72 మందిని చంపాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 17,000 మందిని హత్య చేశారు.. వీరిలో ఎవరు ప్రజల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారో అర్ధమవుతోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోతలో మూడు రోజుల్లో 3,000 మంది అమాయకులను హత మార్చారని నళీన్ అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ట్వీట్టర్ ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించారు. 

ఇకపోతే కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే సైతం నాదూరాం గాడ్సేపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడు దశాబ్దాల తర్వాత ఇటువంటి చర్చ జరుగుతోంది. చివరకు గాడ్సే ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తారు అంటూ అనంత్ కుమార్‌ హెగ్డే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైనా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. 

దీంతో ఆయన తన ట్వీట్ ను తొలగించారు. నాదూరాం గాడ్సేపై ఈ ముగ్గురు నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు నేతలు చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అవి వారి వ్యక్తిగత ఆరోపణలు అని స్పష్టం చేశారు. వారి వ్యాఖ్యలు బీజేపీ సిద్ధాంతాలకు విరుద్దమన్నారు. 

అనంత్‌ కుమార్‌, ప్రజ్ఞాసింగ్‌, నళిన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీ భావజాలానికి వ్యతిరేకమన్నారు. వారి వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు.  వివాదాస్పద వ్యాఖ్యలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించినట్లు తెలిపారు. వారి వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే వారు చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమ శిక్షణ కమిటీకి పంపినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆమెను ఎప్పటికీ క్షమించను: సాధ్వి ప్రజ్ఞాసింగ్ పై మోదీ ఫైర్