హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం : జెరూసలేంలో చిక్కుకున్న 27 మంది మేఘాలయా వాసులు.. క్షేమంగా ఈజిప్ట్ బోర్డర్‌లోకి
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న మేఘాలయకు చెందిన 27 మంది బృందం సరిహద్దు దాటి ఈజిప్ట్‌లోకి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తెలిపారు. రాజ్యసభ ఎంపీ డాక్టర్ డబ్ల్యూఆర్ ఖర్లూకీ , అతని కుటుంబ సభ్యులతో కూడిన బృందం జెరుసలేంకు తీర్ధయాత్ర నిమిత్తం వెళ్లింది.

హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చిన మిలిటెంట్లు.. ప్రజలను హతమార్చడంతో పాటు కొందరిని బందీలుగా పట్టుకుని తమ వెంట గాజాకు తీసుకెళ్తున్నారు. ఇజ్రాయెల్ భూభాగంలో వందలాది మంది హమాస్ ఉగ్రవాదులు వున్నారు. వీరందరినీ ఏరివేసేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ మొదలెట్టింది. అయితే మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్న వారిలో కొందరు విదేశీయులు కూడా వున్నారు.
మరోవైపు ఇజ్రాయెల్‌లో భారతీయులు కూడా చిక్కుకుపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేంద్ర విదేశాంగ శాఖ, పీఎంవోలు నేరుగా పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ తెలిపారు. కాగా.. మేఘాలయకు చెందిన 27 మంది బృందం సరిహద్దు దాటి ఈజిప్ట్‌లోకి ప్రవేశించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ, భారతీయ మిషన్ చర్యల కారణంగా ఇజ్రాయెల్‌లోని సంఘర్షణ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులు సురక్షితంగా ఈజిప్ట్ సరిహద్దు దాటారని సీఎం వెల్లడించారు.
మేఘాలయకు చెందిన 27 మంది యాత్రికులు జెరూసలేంలోని బెత్లెహెమ్‌లో చిక్కుకుపోయారు. రాజ్యసభ ఎంపీ డాక్టర్ డబ్ల్యూఆర్ ఖర్లూకీ , అతని కుటుంబ సభ్యులతో కూడిన బృందం జెరుసలేంకు తీర్ధయాత్ర నిమిత్తం వెళ్లింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో వారు సంఘర్షణ ప్రాంతంలో చిక్కుకుపోయారు. మేఘాలయ ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని సురక్షితంగా తరలించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది.
అంతకుముందు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌లోని భారతీయుల గురించి తనకు రాత్రి పలు సందేశాలు వచ్చాయన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా అక్కడి పరిస్ధితిని పర్యవేక్షిస్తుందని మీనాక్షి చెప్పారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్ధులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వైరస్ సంక్షోభం సమయాల్లో భారతదేశం తన పౌరులను విదేశాల నుంచి విజయవంతంగా రెస్క్యూ చేసిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆపరేషన్ గంగా, వందే భారత్ మిషన్ సమయాల్లో తాము ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చామని మీనాక్షి లేఖి తెలిపారు. భారత ప్రభుత్వం, పీఎంవో స్వయంగా వారితో టచ్‌లో వుందని ఆమె వెల్లడించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్ ప్రయోగించిన రాకెట్ దాడుల్లో మరణించిన వారికి మీనాక్షి సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ ఇప్పటికే తన సంతాపాన్ని తెలియజేసి ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారని కేంద్ర మంత్రి చెప్పారు.