బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇద్దరు మహిళ కార్మికుల మృతి.. భీతావహంగా మారిన ఘటనా స్థలి..
బాణాసంచా తయారీదారుల కేంద్రమైన తమిళనాడులోని శివకాశిలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీదారుల కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మహిళ కార్మికులు సజీవదహనమయ్యారు.

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శివకాశి సమీపంలోని విరుదునగర్ లోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించినట్లు పోలీసులు మంగళవారం (జూలై 25) తెలిపారు. మధ్యాహ్నం వేళల్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కలా ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని, మృతదేహాలను పరిశీలించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని ఎస్ బాను (39), ఆర్ మురుగేశ్వరి (37)గా గుర్తించారు. వారు పని చేసే షెడ్‌లలో రసాయనాల విస్పోటనం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తయారీ యూనిట్ ప్రాంగణంలో ఇతర కార్మికులు ఉన్నప్పటికీ.. వారు క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలుపుతూ.. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందిన శివకాశిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6.5 లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.