ఢిల్లీ మెట్రో రైల్వే గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ (ఎస్ఎఫ్‌జే)తో సంబంధాలు వున్నాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది.

ఢిల్లీ మెట్రో రైల్వే గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారని.. వీరికి ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ (ఎస్ఎఫ్‌జే)తో సంబంధాలు వున్నాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. ఆదివారం దేశ రాజధానిలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు కనిపించాయి. పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సూరజ్‌మల్ స్టేడియం, నాంగ్లోయ్ వంటి మెట్రో స్టేషన్ల‌సై ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది, ఖలిస్తాన్ రెఫరెండం వంటి నినాదాలు కనిపించాయి. ఈ స్టేషన్‌లన్నీ పశ్చిమ ఢిల్లీలోనే వున్నాయి. 

పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. వేర్పాటువాద సంస్ధ ఎస్‌ఎఫ్‌జే అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆదేశాల మేరకు ఈ నినాదాలు రాసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లోని పలు సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిందితులను గుర్తించారు. నిషేధిత ఎస్ఎఫ్‌జే గ్రూప్ సభ్యులు పలు మెట్రో స్టేషన్‌లలో వున్నారని పోలీసులు చెప్పారు.