మహిళా బాక్సర్ పై రైలులోనే ఓ కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపిన ప్రకారం... సందీప్ మాలిక్ అనే వ్యక్తి గతంలో ఒక బాక్సర్. అనేక ప్రైవేటు బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొన్న అనుభవం ఉంది. ఢిల్లీలోని సోనాపేట్ లో తన పేరుమీదే ఒక బాక్సింగ్ అకాడమీని నడుపుతున్నాడు. 

Also Read మోడల్ పై బిల్డర్ రేప్: ఐదుగురు సహాయకుల ముందు అఘాయిత్యం...

బాధిత యువతి కూడా అతని దగ్గరే బాక్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఫిబ్రవరిలో కోల్ కతా లో జరిగిన మూడో బెంగాల్ బాక్సింగ్ క్లాసిక్-2020 పోటీలకు సందీప్ మాలిక్ తన శిష్యులందరినీ తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే దురంతో ఎక్స్ ప్రెస్ లో వీరు ప్రయాణిస్తున్నప్పుడు సదరు బాధిత యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి ఒడిగట్టాడు.

కోల్ కతాలో ఉన్న అన్నిరోజులు కూడా ప్రబుద్ధుడు ఆమెపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి గత గురువారం స్థానిక పోలీసులకు ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ దారుణం రైల్లో జరగడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును రైల్వే పోలీసులకు అప్పగించారు.

యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె చెప్పిన వివరాలను మేజిస్టేట్ సమక్షంలో నమోదు చేసుకున్నారు. వెంటనే సందీప్ మాలిక్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరుగా ఒప్పుకున్నాడు. శిక్షణా కేంద్రంలో మిగిలిన వారిపై కూడా అతను వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.