కేరళలో ఒక్క రోజే 1,801 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్క ఈ కేసులు రిపోర్ట్ అయ్యాయి. వయోధికులు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మన దేశంలో తొలిసారి కరోనా వైరస్ కేసు రిపోర్ట్ అయిన రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో మరోసారి కేసులు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

తిరువనంతపురం: కేరళలో శనివారం ఒక్క రోజే 1,801 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో టెస్టింగ్ శాపింల్స్‌నూ పెంచారు. హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్న కేసులు స్వల్పంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరమైన బెడ్‌లు 0.8 శాతంగా ఉండగా, 1.2 శాతం ఐసీయూ బెడ్‌ల అవసరం పడుతున్నాయి.

కరోనా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం కొవిడ్ పరిస్థితులను సమీక్షించడానికి సమావేశం నిర్వహించారు.

జెనెటిక్ టెస్టుల్లో చాలా రిజల్ట్‌లలో ఒమిక్రాన్ వేరియంట్ కనిపిస్తున్నదని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని వివరించారు.

కరోనా మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలున్న వారిలో నమోదు అవుతున్నాయని వివరించారు. 85 శాతం కరోనా మరణాలు 60 ఏళ్లు పైబడిన వారిలోనే ఉన్నాయని తెలిపారు. కాగా, మిగితా 15 శాతం మరణాలు మాత్రం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన వారిలో ఉన్నాయని వివరించారు. 

Also Read: బొగ్గు గనుల కేటాయింపు.. తమిళనాడు, తెలంగాణలకు వేర్వేరు నిబంధనలా : కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

కాబట్టి, వయోధికులు ఇంటిలో ఉన్నప్పుడు మాస్క్ తప్పక ధరించాలని ఆమె సూచించారు. గర్బిణులు, వయోధికులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పారు.

దేశంలో తొలి కరోనా వైరస్ కేసు ఈ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. ప్రతి వేవ్‌లోనూ కేరళ, మహారాష్ట్రల్లో అత్యధిక కేసులను చూశాం. ఈ సారి కూడా కేరళలో కేసులు పెరగడంతో మరోసారి చర్చ తీవ్రమవుతున్నది.