తెలంగాణలోని 4 బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. తమిళనాడు, తెలంగాణలకు వేర్వేరుగా నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.
బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించి కేంద్రంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణలోని 4 బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని ఆయన శనివారం ట్వీట్ చేశారు. సదరు బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తమిళనాడులోని 3 లిగ్నైట్ గనులను వేలం నుంచి తప్పించడాన్ని గుర్తుచేసిన ఆయన సింగరేణికి కూడా ఇదే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, తెలంగాణలకు వేర్వేరుగా నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ఆంగ్ల వార్తా సంస్థ రాసిన కథనాన్ని కూడా మంత్రి తన ట్వీట్‌కు జోడించారు.
కాగా.. ప్రభుత్వం కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ వేలంలో టెండర్ ద్వారానే బొగ్గు గనుల్ని సొంతం చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి మార్చి 29న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
