గంగా జలంపై 18 శాతం జీఎస్టీ.. తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్.. దోపిడీ, కపటత్వానికి పరాకాష్ట అంటూ విమర్శలు..
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. గంగా జలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం విధిస్తోందని మండిపడింది. మణిపూర్ లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రశ్నించింది.
గంగా జలంపై 18 శాతం జీఎస్టీ విధించడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. దానిని దోపిడీ, కపటత్వానికి నిదర్శనం అంటూ విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే హింసతో అతలాకుతలం అవుతున్న మణిపూర్ లో ఎప్పుడు పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయల కోసం ‘ఆపరేషన్ అజయ్’.. నేడు బయలుదేరనున్న మొదటి విమానం..
ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్టు పెట్టారు. ‘‘మోదీ గారూ.. ఒక సాధారణ భారతీయుడి పుట్టుక నుంచి జీవిత చరమాంకం వరకు మోక్షదాయిని అయిన గంగామాత ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజు ఉత్తరాఖండ్ లో ఉండటం మంచిదే, కానీ మీ ప్రభుత్వం పవిత్ర గంగా జలాలపై 18 శాతం జీఎస్టీని విధించింది. ఇంటి దగ్గరకి గంగా జలాలు (హోమ్ డెలివరీ) పొందే వారిపై ఈ భారం ఎంత ఉంటుందో ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఇది మీ ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి పరాకాష్ట.’’ అని పేర్కొన్నారు.
అలాగే మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక యానిమేటెడ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో ఘర్షణ వల్ల సంభవించిన మరణాలు, మృతదేహాలు, హింస కారణంగా రాష్ట్రం కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ మణిపూర్ కు ఎప్పుడు వెళ్తారని దేశం అడుగుతోందని అందులో కాంగ్రెస్ విమర్శించింది.