కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై (Omicron), దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు (Covid Vaccination) సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) రాజ్యసభలో (Rajya Sabha) మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే దేశంలో ఒమిక్రాన్ కేసులు, కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) రాజ్యసభలో (Rajya Sabha) మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందని తెలిపారు. రోజు నిపుణులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 

ఒకవేళ వైరస్ వ్యాప్తి జరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టుగా మన్సుఖ్ మాండవియా రాజ్యసభలో తెలిపారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో తమ అనుభవంతో.. వేరియంట్ వ్యాప్తి చెందుతున్నప్పుడు సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవడానికి ముఖ్యమైన మందుల బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

Also read: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసలు బిల్లులో ఏముందంటే..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య కార్యకర్తల కృషితో కోవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో అర్హులైన వారిలో 88 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. అర్హులైన వారిలో 58 శాతం మందికి రెండో డోస్‌లు ఇచ్చినట్టుగా చెప్పారు. భారతదేశంలోని అత్యధిక జనాభా టీకాలు పొందారని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగిన పరిమాణంలో కోవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 17 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌ల తయారీ సామర్థ్యం పెరిగిందని మన్సుఖ్ మాండవియా అన్నారు. భారతదేశం నెలకు 31 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో.. ఇది నెలకు 45 కోట్ల డోస్‌లకు పెరుగుతుందని తెలిపారు. పిల్ల‌ల వ్యాక్సిన్ కూడా త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని చెప్పారు.