ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 16 మంది మృతి.. నైనితాల్‌కు రాకపోకలు బంద్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవడంతో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్క రోజే 11 మంది మరణించారు. భీకర వర్షాలతో రోడ్లు, బ్రిడ్జీలు, ఇళ్ళు ధ్వంసమైపోయాయి. కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. టూరిస్ట్ స్పాట్ నైనితాల్‌కు రాష్ట్రం నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో వరుణుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం నుంచి కురుస్తున్న భీకర వర్షాలకు Uttarakhand అతలాకుతలమైంది. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. నిలుచునే చోటులేకుండా పోయింది. రాష్ట్రమంతా వరద నీటితో నిండిపోయింది. రోడ్లపై వరద నదుల్లాగే ప్రవహిస్తున్నది. ఇళ్లు, రోడ్లు కూలిపోయాయి. ఓ బ్రిడ్జీ కూడా వరద దాటికి ధ్వంసమైపోయింది. వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మొత్తం 16 మంది మరణించారు. ఇవాళ ఒక్కరోజే 11 మంది మరణించారు. సోమవారం ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.
అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం అసలురూపం ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్నది. మూడు రోజులుగా ఏకధాటిగా Heavy Rains పడుతున్నాయి. రాష్ట్ర పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సీఎంతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు బృందాలు సహా ఆర్మీ కూడా సహాయక చర్యల్లోకి దిగింది. ఇప్పటికే మూడు హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్‌లో చేరింది. ఇందులో రెండు హెలికాప్టర్లను Nainitalకు పంపారు. గర్హవాల్‌కు మిగతా హెలికాప్టర్‌ను పంపారు.
ఈ రోజు నుంచి వర్షం తగ్గుముఖం పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం వేసింది. ప్రాణనష్టం, పంటనష్టం, ఆస్తి నష్టం జరిగిందని సీఎం ధామి అన్నారు.
మంగళవారం ఒక్క రోజే 11 మంది మరణించారు. ఇందులో ఏడుగురు ముక్తేశ్వర్, ఖైరానా ఏరియాలో ఇళ్లు కూలి మరణించారు. మరొకరు ఉధమ్ సింగ్ నగర్‌లో వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు నేపాల్‌కు చెందిన లేబర్లు ఉన్నారు. కొంద ప్రాంతం నుంచి వరదతోపాటు కొట్టుకువచ్చిన చిత్తడి వీరిని సజీవంగా సమాధి చేసిందని తెలిసింది. మరో ఇద్దరు చంపావత్ జిల్లాలో ఇల్లు కూలిపోయి మరణించారు. ఇదే జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీ వరదలకు కొట్టుకుపోయింది.
టూరిస్టులకు కేంద్రస్థానంగా ఉండే నైనితాల్ పరిస్థితి దారుణంగా ఉన్నది. Floods ఉధృతి, కొండచరియలు విరిగిపడటంతో నైనితాల్‌ను రాష్ట్రంతో కలిపే మూడు దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు నైనితాల్ రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయింది. కాలాధుంగి, హల్ద్వాని, భవాలీ నగరాలకూ కలిపే రోడ్లు కొండ చరియల శిథిలాలతో ధ్వంసమైపోయాయి. ఐకానిక్ నైనితాల్ సరస్సు ఉప్పొంగుతున్నది. 24 గంటల్లో 500 మి.మీల వర్షం కురవడంతో నైనితాల్‌లో నీటిమట్టం రికార్డుస్థాయికి పెరిగింది.
బద్రినాథ్ హైవే దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న కారు అందులో ఇరుక్కుపోయింది. పై నుంచి వరద పొంగిపోతుండటంతో రాళ్ల మధ్యే కారు చిక్కుకుంది. దీన్ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ కారును పక్కకు తప్పించింది.