కరోనా వైరస్ దేశంలో సామాజిక పరిస్థితులను మరింత దిగజారుస్తోంది. వైరస్ సోకిందంటే చాలు తెలిసినవారు, బంధుమిత్రులు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. సాయం కావాలని స్వయంగా అర్ధించినా ఆపదలో ఆదుకునేవారు లేరు
కరోనా వైరస్ దేశంలో సామాజిక పరిస్థితులను మరింత దిగజారుస్తోంది. వైరస్ సోకిందంటే చాలు తెలిసినవారు, బంధుమిత్రులు వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. సాయం కావాలని స్వయంగా అర్ధించినా ఆపదలో ఆదుకునేవారు లేరు. ఇక కోవిడ్ వచ్చి మరణించిన వారి పరిస్ధితి మరింత దారుణం. అంత్యక్రియలు చేసేందుకు స్వయంగా కుటుంబసభ్యులు, తోడబుట్టినవారు, పిల్లలే ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు, స్వచ్ఛంద సంస్థలే దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేస్తున్నాయి. తాజాగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోవాల్సిందిపోయి వారి సొమ్మునే కాజేసి వాటాలు పంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం అరియా జిల్లా బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని (18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్యవధిలో తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, కరోనాతో తల్లి ప్రియాంక దేవి మరణించారు. దీంతో పిల్లల్లో పెద్ద అయిన 18 ఏళ్ల కుమార్తె తల్లి అంత్యక్రియల కోసం గ్రామస్తుల సాయం కోరింది.
Also Read:గ్రామ జనాభా 250.. కేసుల సంఖ్య 100: ఓ పెళ్లిలో ఒక్కరి నుంచి వూరంతా వైరస్
ఆ పాప అభ్యర్ధనను మన్నించి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలిక తల్లి మృతదేహానికి తన ఇంటి సరిహద్దుల్లోనే అంత్యక్రియలు నిర్వహించింది. కానీ తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన దశదిన కర్మ నాడు భోజనం చేసేందుకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. భోజనం చేసిన అనంతరం తల్లిదండ్రుల చికిత్స కోసం తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా ఆ పిల్లల దగ్గరి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా సోని మాట్లాడుతూ.. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తుల్ని సాయం కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదని.. కానీ దశదిన కర్మకు 150 మంది గ్రామస్తులు వచ్చారని వాపోయింది. ఇంతమంది వస్తారని తాము ఊహించలేదని... వచ్చిన వాళ్లు భోజనం చేసిన తర్వాత తన తండ్రి చికిత్సకు డబ్బులు ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని బెదిరించారంటూ సోనీ కన్నీటి పర్యంతమైంది.
