ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనం మాత్రం వీటిని పట్టించుకోకుండా ఘనంగా ఫంక్షన్లు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో కోవిడ్ మరింత విజృంభిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా చిచ్చు పెట్టింది. పెళ్లి వేడుకకు హాజరైన వారిలో చాలా మంది మాస్కులు ధరించకుండా.. శానిటైజర్లు వాడకుండా విచ్చలవిడిగా తిరిగారు.

దీంతో ఆ తర్వాతి నుంచి ఆ గ్రామంలో ఒక్కొక్కరిగా వైరస్ బారినపడటంతో పాటు నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కారేపల్లి మండలంలోని 250 మంది జనాభా ఉన్న ఓ గ్రామంలో ఈనెల 14న ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఓ వ్యక్తికి కరోనా సోకింది. సదరు వ్యక్తి వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో తన బంధువులు, మిత్రులతో సరదాగా గడిపాడు.

Also Read:ఆనందయ్య మందుపై అభ్యంతరం ఏమిటీ?: చినజీయర్‌స్వామి

ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ వరకు ఒకటి, రెండు కేసులు నమోదువుతూ వస్తున్న ఆ గ్రామంలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రోజుకు పదికిపైగానే కేసులు నమోదవడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ పురంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు. ఇదే సమయంలో వారం వ్యవధిలో కరోనాతో నలుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు పెళ్లి కుమారుడి తండ్రి. అయితే ఆయన అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి తన సిబ్బందికి పీపీవీ కిట్లు అందజేసి దహన సంస్కారాలు పూర్తిచేయించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో వందకుపైగా కేసులు ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.