26/11 Mumbai attack : 26/11 ముంబై దాడులకు 15 ఏళ్లు.. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోడీ..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి 15 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరవీరులను స్మరించుకున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందిన చెప్పారు.
26/11 ఉగ్రదాడులు జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో అమరవీరులను స్మరించుకున్నారు. ఈ ఘటనను అత్యంత దారుణమైన ఉగ్రదాడిగా అభివర్ణించిన ప్రధాని.. ‘‘నవంబర్ 26ను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రోజే దేశం అత్యంత దారుణమైన ఉగ్రదాడికి గురైంది’’ అని అన్నారు.
ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పించిన ప్రధాని.. ఈ రోజు యావత్ దేశం అమరులైన మన ధైర్యవంతులను స్మరించుకుంటోందని చెప్పారు. ‘‘26/11 ఉగ్రవాద దాడులతో ముంబైతో పాటు దేశం మొత్తం వణికిపోయింది. అయితే ఈ ఘటన నుండి కోలుకోవడానికి భారతదేశం తన సామర్థ్యాన్ని ఉపయోగించింది. ఇప్పుడు అదే ధైర్యాన్ని ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఉపయోగిస్తోంది’’ అని ప్రధాని మోడీ తన ‘మాన్ కీ బాత్’ సెషన్ లో తెలిపారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఉగ్రదాడులను గుర్తు చేసుకున్నారు. ఈ దాడుల ప్రణాళిక, అమలుకు బాధ్యులైన వారిని శిక్షించాలన్న భారత్ తపన ఇంకా ఉందని ఆయన అన్నారు. ‘‘26/11 ముంబై ఉగ్రదాడులు జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ భయానక చర్యలకు ప్రణాళిక రచించి అమలు చేసిన వారిని శిక్షించాలన్న మా తపన కొనసాగుతోంది’’ అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
కాగా.. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలోని 10 ప్రదేశాల్లో 2008 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదుల బృందం దాడులకు పాల్పడింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ఉగ్రవాదులు ఆరోజు రాత్రి నగరంలోకి ప్రవేశించారు. నాలుగు రోజుల వ్యవధిలో 166 మందిని హతమార్చారు. వారి దాడిలో 300 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమవగా, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక పాకిస్థానీ ఉగ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను అరెస్టు చేశారు. 2010 మేలో కసబ్ కు మరణశిక్ష విధించగా, రెండేళ్ల తర్వాత పుణెలోని గరిష్ఠ భద్రతా జైలులో ఉరి తీశారు.