Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం : 141కి చేరిన మృతులు.. రాజ్ కోట్ ఎంపీ ఫ్యామిలీలో 12మంది మృతి..

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 141 కి చేరుకుంది. ఈ ఘటనలో రాజ్ కోట్ ఎంపీ కుటుంబానికి చెందిన 12మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

141 Dead in Gujarats Morbi bridge collapses, 12 people died in Rajkot MPs family
Author
First Published Oct 31, 2022, 12:36 PM IST

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని మోర్బీలో బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 141 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 177 మందిని రక్షించారు. ఇంకా అనేక మంది ఆచూకీ దొరకలేదు. వారి గురించి రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

అయితే, ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వంతెన ప్రమాదానికి సంబంధించి విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో వంతెన మీద ఉన్న వ్యక్తులు వంతెనను అటూ, ఇటూ ఊపడం కనిపిస్తుంది. ఇది కూడా ప్రమాదానికి కారణాల్లో ఒకటి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇక ఈ ప్రమాదంలో రాజ్ కోట్ ఎంపీ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుటుంబానికి చెందిన 12మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 500 మంది వ్యక్తులు సస్పెన్షన్ బ్రిడ్జిపై ఉన్నారు. దీంతో వీటికి ఆసరాగా ఉన్న కేబుల్స్ తెగిపడి, బ్రిడ్జి కింద ఉన్న  నదిలో ప్రజలు పడిపోయారు.

గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదం :132కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

వడోదరకు 300 కి.మీ దూరంలో ఉన్న 150 ఏళ్ల నాటి వంతెనపై పలువురు ఛత్ పూజ ఆచారాలు నిర్వహిస్తున్నారు. వంతెన తెగిపోవడంతో ఒక్కసారిగా అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలా మంది వంతెన విరిగిన భాగాలు పట్టుకుని వేలాడుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తున్నాయి. మరికొందరు నదిలో ఈత కొడుతూ సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు.

మచ్చు నదిపై వంతెన మరమ్మతుల కోసం ఏడు నెలలుగా మూసివేశారు. ఈ వంతెనను గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న తిరిగి తెరిచారు. "గత వారమే వంతెన పునర్నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఘటన మాకు కూడా షాకింగ్ గానే ఉంది. ప్రమాద విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఈ విషాదానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది" అని గుజరాత్ కార్మిక, ఉపాధి శాఖా మంత్రి బ్రిజేష్ మెర్జా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సమయంలో గుజరాత్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ విచారణ జరుపుతోందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ఈ ఉదయం తెలిపారు. 

"దీనికి కారణమైన వారిపై హత్య, ఉద్దేశపూర్వకంగా మరణానికి దారితీసేలా చేసిన చర్య కింద కేసు నమోదు చేయబడుతుంది" అని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి చెప్పారు.

వందేళ్ల పురాతనమైన ఈ బ్రిడ్జి రినోవేషన్ తరువాత.. తిరిగి తెరవడానికి ముందు భద్రతా పరమైన ధృవీకరణ పత్రం తీసుకోలేదని స్థానిక మున్సిపల్ బాడీ చీఫ్ సందీప్‌సిన్హ్ జాలా తెలిపారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదా ఎన్డీఆర్ఎఫ్ ఐదు బృందాలు తప్పిపోయిన వారిని కనుగొనడానికి రాత్రినుంచి పనిచేస్తూనే ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా తరువాత ఈ ఆపరేషన్‌లో చేరాయి.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా ప్రధాని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios