జార్ఖండ్‌లోని ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాలు శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ దఫాలో ఒక రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ముఖ్య పోటీదారులుగా ఉన్నారు. 

18,01,356 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్ జెండర్స్ తో సహా సహా మొత్తం 37,83,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశలో 189 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

Also read: 'మహా' బలపరీక్షకు ముహూర్తం ఫిక్స్...స్పీకర్ ఎవరు?

చత్రా, గుమ్లా, బిషున్‌పూర్, లోహర్‌దగా, మణికా, లాతేహార్, పంకీ, డాల్టన్‌గంజ్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్, హుస్సేనాబాద్, గర్వా, భవనాథ్‌పూర్ నియోజకవర్గాలు రేపు పోలింగ్ కి వెళ్లనున్నాయి. 

3,906 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని, వీటిలో 989 మందికి వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది.

మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బందిని వాయుమార్గం ద్వారా పోలింగ్ స్టేషన్లకు చేరవేస్తున్నట్టు ఇసి అధికారులు తెలిపారు.

నగదు పంపిణీ, మద్యం, ఇతర ప్రలోభాలకు కళ్లెం వేయడానికి, ఎన్నికల  ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండటానికి ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

1950 కు డయల్ చేయడం ద్వారా ఓటర్లు పోలింగ్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

మొదటి దశలో బిజెపి 12 స్థానాల్లో పోటీ చేస్తుండగా, హుస్సేనాబాద్‌ స్థానంలో స్వతంత్ర వినోద్ సింగ్‌కు మద్దతు ఇస్తోంది.

Also read: తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జెడిల ప్రతిపక్ష కూటమి వరుసగా నాలుగు, ఆరు, మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. 

బిజెపి అభ్యర్థి, జార్ఖండ్ ఆరోగ్య మంత్రి రామ్‌చంద్ర చంద్రవంశీ, జార్ఖండ్ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి రామేశ్వర్ ఒరాన్ వంటి ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు ఈ మొదటి దశ పోలింగ్ లో తేల్చనున్నారు. 

ఇటీవలే బిజెపిలో చేరిన మాజీ పిసిసి చీఫ్ సుఖ్దేయో భగత్  ప్రస్తుత పీసీసీ చీఫ్  రామేశ్వర్ ఒరాన్ తో తలపడుతున్నారు. 

ఛతర్‌పూర్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో, బిజెపి మాజీ చీఫ్ విప్ రాధాకృష్ణ కిషోర్ అదే సీటు నుంచి ఎజెఎస్‌యు పార్టీ టికెట్‌పై పోటీ పడుతున్నారు.

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.

జార్ఖండ్‌లో ఎన్నికలు ఐదు దశల్లో జరుగనున్న విషయం తెలిసిందే.  డిసెంబర్ 23 న ఫలితాలు వెల్లడవనున్నాయి.