ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ముహూర్తం ఖరారయ్యింది.  29వ తారీఖున శనివారం రోజున ఉద్ధవ్‌ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. 

ఇందుకోసం మహారాష్ట్ర అసెంబ్లీ శనివారం నాడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాలను నిర్వహించడానికి ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే  ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు. 

Also read: గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

అయితే ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉద్ధవ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోలంబ్కర్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక రేపటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ను ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సర్వత్రా స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవిని కట్టబెట్టేందుకు అన్ని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించడంతో, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి పృథ్వీ రాజ్ చవాన్ స్పీకర్ పదవిని చేపడతాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. 

ఉద్దవ్‌తో పాటు శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్.. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ రౌత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ ఇన్ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉద్థవ్ వెల్లడించారు. సామ్నా పత్రికను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1988లో స్థాపించారు. అప్పటి నుంచి పార్టీకి గొంతుకగా సామ్నా మారిపోయింది.

Also read:సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

ఈ పత్రిక వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఉద్ధవ్ థాక్రేనే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో పదవిలో ఉండటం భావ్యం కాదని భావించిన ఉద్థవ్ ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు. 

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన అజిత్, తన వర్గం ఎమ్మెల్యేలు  కలిసిరాకపోవడంతో, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు, గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.

ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో​ అజిత్‌ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో మరోమారు ఏమవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.