Asianet News TeluguAsianet News Telugu

సెంట్రల్ విస్టా కోసం రూ. 1,289 కోట్లు కేటాయించాం: కేంద్రం.. నూతన పార్లమెంటు భవనం ఎప్పుడు సిద్ధమవుతుందంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, నిర్మాణ పనుల పురోగతి, అంచనా వ్యయాలను పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,289 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. నూతన పార్లమెంటు భవన నిర్మాణం 35శాతం పూర్తయిందని, వచ్చే ఏడాది అక్టోబర్‌లోపు పూర్తిగా సిద్ధమవుతుందని అంచనా వేసింది. రీడెవలప్‌మెంట్ కోసం ఇప్పటి వరకు రూ. 190.76 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించింది.

1289 crore allocated fo central vista says govt in parliament
Author
New Delhi, First Published Dec 2, 2021, 5:31 PM IST

న్యూఢిల్లీ: దేశరాజధాని Delhiలోని లూటియెన్స్‌(Lutyens)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న Central Vista Project కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో రూ. 1,289 కోట్ల నిధులు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు Parliamentలో వెల్లడించింది. సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్ కింద నాలుగు ప్రాజెక్టులు నూతన పార్లమెంటు భవన నిర్మాణం, సెంట్రల్ విస్టా అవెన్యూ అభివృద్ధి, ఉపరాష్ట్రపతి భవన నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్‌ల నిర్మాణాలను చేపడుతున్నట్టు వివరించింది. ఈ నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయాలతోపాటు ఇప్పటి వరకు చేసిన ఖర్చు వివరాలపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఈ రోజజు లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

నూతన పార్లమెంటు భవన నిర్మాణం అంచనా వ్యయం రూ. 971గా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇందుకోసం రూ. 340.58 కోట్లను కేటాయించినట్టు వివరించింది. కాగా, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు నూతన పార్లమెంటు భవనం సిద్ధమయ్యే అవకాశం ఉన్నదని, ఇప్పటి వరకు 35శాతం నిర్మాణం పూర్తయిందని తెలిపింది. కాగా, సెంట్రల్ విస్టా అవెన్యూ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 608 కోట్లు అని, ఇప్పటి వరకు రూ. 190.76 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించింది. ఈ ప్రాజెక్టు పనులు 60శాతం పూర్తయ్యాయని, ఈ నెలాఖరు వరకు పూర్తవుతుందని పేర్కొంది. కాగా, కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్ బిల్డింగ్ 1, 2, 3 ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 3,690 కోట్లు అని, ఇప్పటి వరకు రూ. 7.85 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదని, 2023 నవంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించింది. ఉప రాష్ట్రపతి నివాస భవనం అంచనా వ్యయం రూ. 208.48 కోట్లు అని పేర్కొన్న ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 15 కోట్ల నిధులు కేటాయించినట్టు పేర్కొంది. ఇది వచ్చే ఏడాది నవంబర్ కల్లా పూర్తవుతుందని వివరించింది.

Also Read: ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక తనిఖీ.. నూతన పార్లమెంటు నిర్మాణ పనుల పరిశీలన.. వీడియో ఇదే

ఈ ప్రాజెక్టుల ద్వారా నేరుగా పది వేల మంది నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మకులకు ఉపాధి కల్పించింది. మొత్తంగా సుమారు 24.12 లక్షల ఉపాధిని కల్పించింది. వీటితోపాటు తయారీరంగం, రవాణా, సిమెంట్, స్టీల్, బిల్డింగ్ మెటీరియల్ రంగంలోనూ ఉపాధికి దోహదపడినట్టు కేంద్రం తెలిపింది. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరిస్తుందని, ఆత్మనిర్భర్ భారత్‌కు దోహదపడుతుందని వివరించింది. సెంట్రల్ విస్టా అభివృద్ధి పనులకు, ఎంపీల్యాడ్స్  స్కీమ్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. గత నెల 10వ తేదీన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఎంపీల్యాడ్ స్కీమ్ కొనసాగించడానికి నిర్ణయించిందని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు కొనసాగుతుందని తెలిపింది.

1930లలో బ్రిటీషర్లు నిర్మించిన లూటియెన్స్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. లూటియెన్స్‌లో 3.2 కిలోమీటర్ల పవర్ కారిడార్‌లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనం సహా ఇతర నిర్మాణాలతోపాటు ఇది వరకే ఉన్న కొన్ని భవనాలనూ ధ్వంసం చేసి పునర్నిర్మించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios