బీహార్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 12యేళ్ల బాలికపై కీచకులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారిపై సామూహిక హత్యాచారానికి తెగబడ్డ నిందితులు.. ఆపై అర్థరాత్రి మృతదేహాంపై కిరోసిన్ పోసి నిప్పటించారు. 

తూర్పు చంపారన్ జిల్లా మోతిహారి గ్రామంలో గత నెల 21న  జరిగిన ఈ దారుణ కాండ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల దేశమంతటినీ కుదిపేసిన హాథ్రస్ ఉదంతాన్ని ఇది గుర్తుకు తెస్తోంది. నేపాల్ కు చెందిన ఓ కుటుంబం మోతిహారీలో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన బాలికపై గత నెల 21న ఇంట్లోనే సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు ఆస్పత్తికి తరలిస్తుండగానే బాధితురాలు మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని వెంటనే దహనం చేయాలంటూ నిందితులు ఒత్తిడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయోద్దని బెదిరించారు. అర్థరాత్రి కిరోసిన్ పోసి మృతదేహాన్ని కాల్చేశారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు ఉప్పునూ ఉపయోగించారు. 

హత్యాచారంపై ఫిర్యాదు చేసేందుకు తాము వెళ్లినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కేసు నమోదుకు వారు నిరాకరించారని పేర్కొన్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదులో అలసత్వం ప్రదర్శించినందుకు సదరు పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్చిని సస్పెండ్ చేశారు. 

హత్యాచార ఘటనపై ఎట్టకేలకు ఈ నెల 2న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో నలుగురిపై సామూహిక అత్యాచారం అభియోగాలు మోపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని.. మిగతావారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు.