దొంగిలించడానికి 12 ఏళ్ల అబ్బాయి ప్లాన్.. చివరికి మర్డర్.. ముగ్గురు అరెస్టు
గజియాబాద్‌లో దొంగతనానికి ప్లాన్ చేసిన 12 ఏళ్ల అబ్బాయి.. చివరకు హంతకుడయ్యాడు. ఆ బాలుడు తనతోపాటు మరో ముగ్గురిని వెంట తీసుకెళ్లాడు. దొంగిలించిన డబ్బుతో ఆయుధాలు కొనుక్కోని క్రైమ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని వారు అనుకున్నట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: దొంగతనానికి ఓ 12 ఏళ్ల బాలుడు ప్లాన్ వేశాడు. పథకం ప్రకారమే చోరీకి మరో ముగ్గురిని వెంటబెట్టుకుని వెళ్లాడు. వారి ప్లాన్ అనుకున్నట్టుగా సాగలేదు. ఏకంగా వారిని చంపేసే దాకా వెళ్లింది. చోరీ చేయడానికి వెళ్లి దంపతులను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన గజియాబాద్‌లో ట్రోనికా సిటీ ఏరియాలో గత నెల జరిగింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ట్రోనికా సిటీలో 60 ఏళ్ల ఇబ్రహిం ఖాన్, 55 ఏళ్ల హజ్రా దంపతులకు ఇటీవలే పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్టు నిందితులకు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత 12 ఏళ్ల అబ్బాయి దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఈ అబ్బాయి ఆ దంపతులకు స్క్రాప్ అమ్మేవాడు. నవంబర్ 22న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ మైనర్ బాలుడు కొంతమందిని వెంటబెట్టుకుని వారి ఇంటికి వెళ్లాడు. డోర్ కొట్టి చెత్త అమ్మడానికి వచ్చానని వారిని లేపాడు. డోర్ తెరిచిన ఆ మహిళను ముకేష్, శుభమ్ అనే యువకులు గొంతు నులిమి చంపేశారు. మిగతా ఇద్దరు ఆలస్యం చేయకుండా నిద్రలో ఉన్న ఇబ్రహిం ఖాన్‌ను ఊపిరాడనివ్వకుండా చేసి హతమార్చారు. ఇంటిలో నుంచి రూ. 54 వేల నగదు, ఓ సిల్వర్ చైన్, ఓ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారని డీసీపీ (రూరల్) ఇరాజ్ రాజా తెలిపారు.
Also Read: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి రూ. 2 కోట్ల పెనాల్టీ.. ఏడాది జైలు శిక్ష
ఉదయం ఆ దంపతుల కూతురికి వీరు విగతజీవులై కనిపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు మొదలు పెట్టారు. హంతకులు ఆ దంపతులకు తెలిసినవారే అనే అనుమానంతో దర్యాప్తు చేశారు. దొంగతనానికి ప్లాన్ చేసిన ఆ 12 ఏళ్ల అబ్బాయి, శుభమ్, ముకేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
దొంగతనం చేసిన తర్వాత మైనర్ బాలుడు ఇంటికి వచ్చి ఏడ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మిగతా ఇద్దరు మాత్రం బిహార్‌లోని వారి స్వస్థలానికి వెళ్లి కొంత కాలం గడిపారని వివరించారు. దొంగిలించిన డబ్బుతో వారు ఆయుధాలు కొనుగోలు చేయాలని అనుకున్నారు. తద్వార నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలని అనుకున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి.