కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా సుళివాడి గ్రామం దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం పది మంది మృతిచెందగా.. నేటికి వారి సంఖ్య 12కి చేరింది. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరోవైవు 80 మందికి పైగా అస్వస్థతకు గురై.. మైసూరు సహా పలు ప్రాంతాల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి మైసూరుకు వచ్చి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబీలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులకు అయ్యే ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

చామరాజనగర్‌ జిల్లా హనూరు తాలూకా సుళివాడి గ్రామంలోని మారెమ్మ దేవాలయ గోపుర నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. శంఖుస్థాపన అనంతరం ప్రసాదం కోసం సిద్ధం చేసిన రైస్‌బాత్‌తో అన్నదానం నిర్వహించారు. ఆ ప్రసాదం తిన్న కొద్దిసేపటికి చాలామంది భక్తులు వాంతులు చేసుకుని స్పృహ తప్పారు. హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 12 మంది చనిపోయారు. ప్రసాదం విషం కావడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.