కోర్టు కేసుల వ్యవహారం అంటేనే వామ్మో అంటారు.. ఎన్నేళ్లు పడుతుందోనంటూ సగటు మానవుడు సైతం పెదవి విరుస్తారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భోపాల్: కోర్టు కేసుల వ్యవహారం అంటేనే వామ్మో అంటారు.. ఎన్నేళ్లు పడుతుందోనంటూ సగటు మానవుడు సైతం పెదవి విరుస్తారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వ న్యాయవాదులకు పాయింట్లు విధానం అమలు చేసింది. మధ్యప్రదేశ్ లో అత్యాచార ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటం కేసులు ఎప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అత్యాచార కేసుల విచారణ త్వరిత గతిన పూర్తి చెయ్యాలని తీర్మానించింది.
అందులో భాగంగా కొద్ది రోజులుగా మధ్యప్రదేశ్‌లో అత్యాచార కేసుల విచారణ వేగంగా పూర్తవుతున్నాయి. మృగాళ్లకు వెంట వెంటనే శిక్షలు వేస్తోంది కోర్టు. గత 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 మందికి మరణశిక్ష పడింది. ఈ ఏడాది జూన్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరికి మందసౌర్‌లోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాయింట్ల విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిందితుడికి మరణశిక్ష పడితే 1000 పాయింట్లు, జీవిత ఖైదు పడితే 500 పాయింట్లు, జైలు శిక్ష పడితే 100 నుంచి 200 పాయింట్లు ఆ న్యాయవాదికి కేటాయిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
అలాగే నెలలో కనీసం 500 పాయింట్లు సాధించని న్యాయవాదికి ప్రభుత్వం నోటీసులను సైతం ఇస్తుంది. అందుకు ప్రభుత్వం ఈ ప్రాసిక్యూషన్ పేరుతో ఒక యాప్‌ను రూపొందించింది. ఆ యాప్ ఆధారంగా వెయ్యి మంది ప్రాసిక్యూటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలనిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 14 ఏళ్ల మైనర్‌కు ఛార్జిషీట్ దాఖలు చేసిన 7 గంటల్లోనే ఉజ్జయిన్ కోర్టు తీర్పు వెలువరించించడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇకపోతే 2016లో దేశవ్యాప్తంగా 38,947 అత్యాచార కేసులు నమోదైతే ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 4,882 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అత్యాచార ఘటనల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలిస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది.నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదికతో అప్రమత్తమైన సర్కార్ అత్యాచారాలను అరికట్టాలన్న ఉద్దేశంతో 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది.
