నవరాత్రి ఉత్సవాల్లో 24 గంటల్లోనే 10 మంది గుండెపోటుతో మృతి
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో గార్బా వేడుకలో పాల్గొని 24 గంటల్లో పది మంది గుండెపోటుతో మరణించారు. వందల సంఖ్యలో ఎమర్జెన్సీ కాల్స్ అంబులెన్స్‌ల కోసం వెళ్లాయి.
ఉత్తరాది వైపు నవరాత్రి ఉత్సవాల్లో గార్బా వేడుక ఉంటుంది. అందరూ సామూహికంగా ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తుంటారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోనూ గార్బా వేడుకలో చాలా మంది కాలు కదిపారు. కానీ, ఈ వేడుకల్లో అపశృతులు చోటుచేసుకున్నాయి. కేవలం 24 గంటల్లోనే పది మంది గుండెపోటుతో కుప్పకూలిపోయారు. టీనేజీ మొదలు మధ్య వయస్కుల వాళ్లు మృతుల్లో ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల తొలి ఆరు రోజుల వ్యవధిలో ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులకు హృద్రోగ సంబంధ సమస్యలతో 521 అత్యవసర కాల్స్ వెళ్లాయి. శ్వాస సమస్యలతో 609 కాల్స్ వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. గార్బా ఆడుకునే సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటి 2 గంటల సమయంలో ఈ కాల్స్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి.
ఈ నెల 20వ తేదీ, 21వ తేదీల మధ్య పది మంది గార్భా వేడుకలో గుండెపోటుతో మరణించారు. ఇందులో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల పిల్లాడు పిన్నవయస్కుడు. గార్బా ఆడుతూనే 24 ఏళ్ల అహ్మదాబాద్ వాసి కూలిపోయాడు. అదే విధంగా కాపాద్వంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు మరణించాడు.
Also Read: గజ్వేల్‌లో టఫ్ ఫైట్!.. ఈటల బలం ఏమిటీ?.. బీజేపీ వ్యూహం ఇదేనా?.. ఇంట్రెస్టింగ్ పాయింట్స్
ఈ ఆందోళనకర పరిస్థితులతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గార్బా వేడుకలకు సమీపంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లు, ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు, గార్బా వేదిక సమీపంలో అంబులెన్స్‌లు ఈజీగా వచ్చేలా ఏర్పాట్లు ఉండాలని గార్బా నిర్వాహకులకు సూచనలు చేసింది. గార్బా వేడుకల వద్దే అంబులెన్స్‌లు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంచుకోవడం మంచిదనీ వారికి తెలిపింది. అందరికీ అందుబాటులో మంచినీరు ఉంచుకోవాలని, సీపీఆర్ గురించి అవగాహన కలిగి ఉండాలని వివరించింది. పలు జాగ్రత్తలను ప్రభుత్వం గార్బా నిర్వాహకులకు సూచిస్తున్నది.
నవరాత్రి ఉత్సవాలకు ముందు ఈ ఏడాదిలో గుజరాత్‌లో ముగ్గురు హార్ట్ ఎటాక్ తో మరణించారు.