దసరా ఉత్సవాలు : గర్భా ఆడుతూ గుండెపోటు .. 24 గంటల్లో పది మంది మృతి , గుజరాత్‌లో కలకలం
గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా దసరా నవరాత్రుల సందర్భంగా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ మరణించినవారే కావడం గమనార్హం . నవరాత్రులు ప్రారంభమైన తొలి ఆరు రోజులలో 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడటం లేదంటూ 690 కాల్స్ వచ్చాయి.
కరోనా తర్వాత దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మాట్లాడుతూ.. ఆటలాడుతూ.. పనిచేస్తూ కూర్చొన్న మనిషి కూర్చొన్న చోటే కుప్పకూలిపోతున్నాడు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తూ ఉండటంతో నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
వీరంతా దసరా నవరాత్రుల సందర్భంగా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ మరణించినవారే కావడం గమనార్హం. వీరిలో 13 ఏళ్ల బాలుడు కూడా వుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్భా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మరణించాడు. అదే విధంగా కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గర్భా ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.
నవరాత్రులు ప్రారంభమైన తొలి ఆరు రోజులలో 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడటం లేదంటూ 690 కాల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా సాధారణంగా గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య రికార్డ్ చేయబడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గర్భా వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్స్ సెంటర్స్ అప్రమత్తంగా వుండాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈవెంట్‌లలోకి అంబులెన్స్‌లు వేగంగా ప్రవేశించేందుకు కారిడార్‌లను రూపొందించాలని గర్భా నిర్వాహకులను కూడా ఆదేశించింది.
అంతేకాకుండా గర్భా వేదికల వద్ద వైద్యులు, అంబులెన్స్‌లు సిద్ధంగా వుంచాలని గర్భా నిర్వాహకులకు సూచించింది. అలాగే తమ సిబ్బందికి సీపీఆర్ చేయడంపై శిక్షణ ఇవ్వాలని, కార్యక్రమంలో పాల్గొనేవారికి పుష్కళంగా మంచినీటిని అందుబాటులో వుంచాలని ఆదేశించింది. కాగా.. నవరాత్రి ఉత్సవాలకు ముందు గుజరాత్‌లో గర్భా సాధాన చేస్తున్న ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.