ఢిల్లీలో మహిళల అక్రమ రావాణా చేస్తున్న ఓ ఇంటిపై కొందరు ఆయుధాలతో దాడికి వెళ్లారు. గన్‌లు, కత్తులతో సుమారు పది మంది ఆ ఇంటిలోకి దూసుకెళ్లి.. నగదు, విలువైన వస్తువులను పట్టుకుని పరారయ్యారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, మరణించాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై సుమారు పది మంది సాయుధులు దాడి చేశారు. గన్‌లతో లోపటికి వెళ్లి అక్కడ ఉన్న వారిపై దాడి చేశారు. ఆ అపార్ట్‌మెంట్‌లో నుంచి నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. వీరు దాడి చేసిన గది అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిసింది. ఆ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నడిచిందని కొందరు స్థానికులు ఆరోపించారు.
సాయుధులు ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి దోచుకునే క్రమంలో కొందరు అడ్డురాగా.. వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, అతను మరణించాడు. శుక్రవారం మరణించిన ఈ వ్యక్తి.. బహుశా అక్కడికి వచ్చిన కస్టమరై ఉంటాడని భావిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ యువతి కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో 17 ఏళ్ల మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కంట్రీమేడ్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, లైవ్ రైండ్ల బుల్లెట్లను రికవరీ చేసుకున్నారు.
ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తిపై కత్తితో దాడి, షూటింగ్ జరిగిందనే సమాచారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో పోలీసులకు అందింది. వినయ్ కుమార్, అతని అసోసియేట్లు అతుల్ కుమార్, సాహిల్‌ల పేరిట ఉన్న అపార్ట్‌మెంట్‌కు పోలీసులు చేరుకున్నారు. వారు అక్కడ ఓ ప్రైవేట్ బిజినెస్ చేస్తున్నారని, డోర్ టు డోర్ సేల్స్ అని డీసీపీ అమృత గుగులోత్ వివరించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో ఆ అపార్ట్‌మెంట్‌లో చొరబడ్డారని, కత్తితో దాడి చేసి క్యాష్ పట్టుకుని పరారయ్యారని పేర్కొన్నారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి తొమ్మిది మందిని గుర్తించారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశారు.
Also Read: నవజీవన్ రైలులో పొగలు: మహబూబాబాద్ రైల్వేస్టేషన్ లో నిలిపివేత
దాడి జరిగిన ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నదని, ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉండగా.. థర్డ్ ఫ్లోర్‌లో ముగ్గురు పురుషులు, ఫోర్త్ ఫ్లోర్‌లో ఇద్దరు మహిళలు నివసిస్తున్నారు. ఈ దాడి జరిగినప్పుడు ఫోర్త్ ఫ్లోర్‌లో నివసించే మహిళలు లేరని థర్డ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న పురుషులు చెప్పారు. కింది నుంచి కొన్ని చప్పుళ్లు వచ్చినప్పుడు తాను గదిలో ఉన్నానని వివరించారు. సాధారణంగా కింది ఫ్లోర్‌లో తరుచూ ఎక్కువ చప్పుళ్లతో మ్యూజిక్ వింటూ ఉంటారని, అక్కడికి తరుచూ పురుషులు, మహిళలు వస్తూ ఉంటారని తెలిపారు. కాబట్టి, అక్కడేదో తప్పు జరుగుతుందని తాను అప్పుడే గ్రహించలేదని వివరించారు. ఈ బిల్డింగ్‌లో ఏవో అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయని గతంలోనే తాము చాలా సార్లు ఓనర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
పది మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళల అక్రమ రవాణాపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు.
