న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్దెట్ ప్రసంగాన్ని ఉర్దూ కవిత్వంతో ప్రారంభించారు. స్వర్గీయ మంజూర్ హష్మి రాసిన కవిత్వంలోని కొన్ని పంక్తులను ఆమె ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. శుక్రవారం లోకసభలో ఆమె బడ్జెట్ ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

యకీన్ హో తో కోయి రాస్తా నికల్తా హై, హవా కీ ఓట్ భీ లే కర్ చరఘ్ జల్తా హై (విశ్వాసం ఉంటే మార్గం దొరుకుతుంది, గాలుల నుంచి కాపాడితే దీపం కూడా వెలుగులు విరజిమ్ముతుంది) అనే కవితా పంక్తులతో సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

గత మంత్రివర్గంలో రక్షణ శాఖను నిర్వహించిన నిర్మలా సీతారామన్ ప్రస్తుత ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఐదేళ్ల క్రితం దేశం ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకుందని ఆమె చెప్పారు. భారత్ ఈ ఏడాది 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పారు.