‘‘ మోడీ గ్రాఫ్‌ని తగ్గించాలి ’’ .. రైతు నిరసనల వెనుక రాజకీయ ఎజెండా ఇదేనా , వీడియోతో బట్టబయలు
పంటకు కనీస మద్ధతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘‘ఢిల్లీ ఛలో’’కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో రైతుల ఆందోళన వెనుక రాజకీయ ఎజెండాను బట్టబయలు చేసింది.
పంటకు కనీస మద్ధతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘‘ఢిల్లీ ఛలో’’కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి రైతులు శంభు, ఖనౌరీ ప్రాంతాలకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. గత పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వాటిని తొలగించి ముందుకు సాగాలని రైతులు ప్రయత్నించగా.. వారిపై పోలీసులు భాష్ప వాయు గోళాలు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్రం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. గురువారం సాయంత్రం చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో సమావేశం కానున్నారు.
అయితే సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రైతు నిరసనలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. దీని వెనుక రాజకీయ కారణాలు వున్నాయని విపక్షాలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో రైతుల ఆందోళన వెనుక రాజకీయ ఎజెండాను బట్టబయలు చేసింది. మోడీ ప్రజాదరణను తగ్గించేలా వ్యూహం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దాలివాల్ మాట్లాడుతూ. మోడీ ప్రజాదరణ గరిష్ట స్థాయికి చేరుకుందని, అయోధ్య రామమందిరం కారణంగా ఆయన గ్రాఫ్ పెరిగిందన్నారు. మనకు తక్కువ సమయం వుందని, ఆ లోపు మోడీ గ్రాఫ్‌ను తగ్గించాలని జగ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
రైతు సంఘాలు, కేంద్రం మధ్య మూడో రౌండ్ చర్చలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో వచ్చింది. మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానంద్ రాయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బృందంలో కనీస మద్దతు ధరల (MSP) వద్ద పంట సేకరణకు చట్టపరమైన హామీతో సహా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించవచ్చు.
తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే హర్యానాలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ఢిల్లీ వైపు కవాతు నిర్వహిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. అటు నిరసనకారులను దేశ రాజధానికి వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నంలో కేంద్రం మరో రౌండ్ చర్చలను ప్రకటించింది.
గడిచిన రెండు రోజుల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చోటు చేసుకోవడంతో పలువురు అధికారులు, రైతులు గాయపడ్డారు. 200కు పైగా రైతు సంఘాల కూటమి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నిరసనలో ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీలు, వ్యవసాయ రుణాల మాఫీ తదితర కీలక డిమాండ్లు వున్నాయి. సోమవారం జరిగిన రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో చర్చలు ఫలప్రదమయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. వివిధ అంశాలపై రైతులతో రసవత్తర చర్చలు జరపగా.. ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. తాము కొన్ని సమస్యలపై ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ .. శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి వుంటుందని ముండా చెప్పారు.