దాదాపు 8 సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా.. సదరు యువతికి నరకం చూపించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లోకి గాజు పెంకులు దూర్చారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. ఆ యువతి దాదాపు 12రోజుల పాటు చావుతో పోరాడింది. చివరకు ప్రాణాలు వదిలింది. ఆమె నిర్భయ.

ఆమె ప్రాణాలు కోల్పోయి 8 సంవత్సరాలు పూర్తయ్యింది. దోషులను ఎప్పుడో పోలీసులు పట్టుకున్నప్పటికీ... వారికి శిక్ష నేటికి పడింది. ఈ నలుగురు దోషులు ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి జిత్తులమారి నక్క వేషాలు చాలానే వేశారు. అయితే.. న్యాయవ్యవస్థ ముందు వారి కుట్రలు ఉడకలేదు. దీంతో.. దోషులు ఉరికంభం ఎక్కక తప్పలేదు.

దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల దేశవ్యాప్తంగా ఆనందాలు వెల్లువిరిస్తున్నాయి. వీరికి తీహార్ జైల్లో శిక్ష పడగా... జైలు పరిసర ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆ పోస్టర్లు ఏర్పాటు చేయడం విశేషం. ఆ పోస్టర్లలో న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు అంటూ రాసి ఉంది. మరికొన్ని పోస్టర్లలో.. ‘ న్యాయానికి ఉదయం’ అంటూ రాసి ఉంది.

Also Read నిర్భయ దోషులకు ఉరి... డెడ్ బాడీలను ఏం చేస్తారంటే......

ఈ పోస్టర్లను సామాజిక కార్యకర్త యోగితా భయానా అనే యువతి ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ ఆమె ఎప్పటి నుంచో ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. ఆమె తన తోటి కార్యకర్తలతో కలిసి ఈ పోరాటంలో పాల్గొన్నారు.

ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాల క్రితం తాము ఈ పోరాటం మొదలుపెట్టామని చెప్పారు. అయితే.. ఈ పోరాటం నేటితో ముగిసిందని ఆమె అన్నారు. నిర్భయకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే సందేశం ప్రపంచానికి ఇవ్వాలనే తాము ఈ ఉద్యమం చేపట్టామని ఆమె చెప్పారు.

ఆమె చేతిలో కూడా కొన్ని పోస్టర్లు కనిపించాయి. వాటిలో.. ‘ నిర్భయకు న్యాయం దక్కింది. ఇక ప్రతి ఒక్కరికి కూతురికి దక్కుతుంది’ అని రాసి ఉంది. మరో పోస్టర్ లో ‘దేశ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు’ అని రాసి ఉంది. కాగా.. నిర్భయకు న్యాయం దక్కాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరినీ ఆ పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి.