ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది తన నివాసం వద్దనే గౌరీ లంకేష్ ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె మృతిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిచాలని పలువురు గత కొంతకాలంగా కోరుతున్నారు. అయినప్పటికీ దీనిపై మోదీ నోరు విప్పలేదు.

అయితే తాజాగా శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్.. గౌరీ లంకేష్ హత్య ఘటనపై స్పందించారు. ‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘గౌరీలంకేశ్‌ హత్య విషయంలో శ్రీరామసేనకు ఎలాంటి సంబంధం లేదు. గౌరీలంకేశ్‌ను చంపేందుకు హిందూ సంస్థలు కుట్ర చేశాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ పాలనలో ఉన్న సమయంలో మహారాష్ట్రలో రెండు హత్యలు, కర్ణాటకలో రెండు హత్యలు జరిగాయి. ఈ ఘటనల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకు బదులుగా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అని అంటున్నారు. కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా.. మోదీ బాధ్యత వహించాలా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో తాను నేరుగా గౌరీలంకేశ్‌ను కుక్కతో పోల్చలేదని ప్రమోద్‌ ముతాలిక్‌ వివరణ ఇచ్చారు.