లక్నో: బోర్డు పరీక్షల్లో కాపీ కొట్టడం ఎలాగో చిట్కాలు చెప్పిన ప్రిన్సిపాల్ అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రిన్సిపాల్ కాపీ కొట్టడంపై చిట్కాలు చెబుతూ కెమెరా కంటికి చిక్కాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (యూపిఎస్ఈబీ) పరీక్షలు మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి. 

మౌ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ మేనేజర్ కమ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పరీక్షల్లో కాపీ కొట్టడంపై చిట్కాలు చెప్పాడు. విద్యార్థుల్లో ఒకతను దాన్ని తన మొబైల్ లో రహస్యంగా రికార్డు చేశాడు.  

కొద్దిమంది తల్లిదండ్రుల సమక్షంలో ప్రవీణ్ మాల్ విద్యార్థులతో మాట్లాడాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనల నేపథ్యంలో వాటిని తుంగలో తొక్కడం ఎలాగో ఆయన విద్యార్థులకు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తూ ఆ విద్యార్థి వీడియోను జత చేశాడు. దాంతో ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు.

తన విద్యార్థులు ఎవరు కూడా ఫెయిల్ కారని, వారు భయపడాల్సిన అవసరం లేదని ప్రిన్సిపాల్ అన్నట్లు వీడియోలో రికార్డు అయింది. వీడియో మొత్తం రెండు నిమిషాల నిడివి ఉంది. 

"మీలో మీరు మాట్లాడుకుంటూ పరీక్షలు రాయండి. ఎవరి చేయి కూడా మీరు ముట్టుకోవద్దు. మీరు పరస్పరం మాట్లాడుకోంది... అది బాగుంటుంది. భయపడొద్దు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నా మిత్రులు. మిమ్మల్ని పట్టుకుని, రెండు మూడు చెంప దెబ్బలు కొట్టినా భయపడొద్దు. సహించండి" అని ప్రిన్సిపాల్ విద్యార్థులకు బోధించారు.

ఇది బాగుందంటూ గుంపులో కొంత మంది అనడం కూడా వీడియోలో రికార్డయింది. "ఏ ప్రశ్నను కూడా వదలొద్దు... అన్సర్ షీట్లో రూ.100 పెట్టండి. టీచర్స్ గుడ్డిగా మీకు మార్కులేస్తారు. మీరు ప్రశ్నకు తప్పుడు సమాధానం రాసిన నాలుగు మార్కులుంటే మూడు మార్కులు ఇస్తారు" అని మాల్ చెప్పారు. జై  హింద్, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ప్రిన్సిపాల్ ముగించాడు.