కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు..సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. తన మీద తానే సెటైర్లు వేసుకుంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టుల పెడుతుంటారు. ఇటీవల ఆమె తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. అయితే... ఆ ఫోటోని చూసి ఆమె కూతురిని ఓ క్లాస్ మేట్ ఏడిపించాడట. విషయం తెలిసిన స్మృతి ఇరానీ తన కుమార్తెను ఏడిపించిన వ్యక్తికి సోషల్ మీడియాలోనే కౌంటర్ ఇచ్చారు.

తన కుమార్తెపై ప్రశంసలు కురిపిస్తూనే ఆకతాయిలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘నిన్న పోస్టు చేసిన నా కుమార్తె ఫోటోను డిలీట్ చేశాను. ఫోటోలో ఆమె అలా చూస్తుండడంపై తన క్లాస్‌లోని ఓ ఇడియట్ ఆమెను ఎగతాళిచేశాడు. తన తల్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలంటూ తన తోటి విద్యార్ధులను కూడా రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఫోటోను చూపిస్తూ తనను ఏడిపిస్తున్నారనీ.. దాన్ని డిలీట్ చేయాలని నా కుమార్తె కోరింది. ఆమె కంటతడి పెట్టడం ఇష్టంలేక నేను అందుకు అంగీకరించాను...’’ అని స్మృతి పేర్కొన్నారు.

ఆ వెంటనే మరో పోస్ట్ కూడా పెట్టారు. తన కుమార్తె పిరికిది మాత్రం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. తన కుమార్తె మంచి క్రీడాకారిణి అని..  లిమ్కా బుక్స్ లో చోటు దక్కించుకుందని.. కరాటే సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ కూడా సాధించిందని ఆమె పేర్కొన్నారు. తన కూతురు అందంగా ఉంటుందని.. ఆమెను ఏడిపించినా తిరిగి పోరాటం చేయగలదని చెబుతూ కూతురిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.