తనకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అవసరం లేదని.. రోడ్డుపై కూడా నిద్రపోగలనని చెబుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆయన గత కొంతకాలంగా పల్లె నిద్ర చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. కాగా.. ఆ కార్యక్రమానికి శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా యాదగరి జిల్లా గురుమిట్కల్ తాలుకా చండరకి గ్రామంలో ఆయన తొలి పల్లె నిద్ర చేపట్టారు.

అయితే... ఆయనకు అక్కడ ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. పల్లె నిద్ర కోసం వెళ్లి.. లగ్జరీ ట్రీట్మెంట్ అందుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆయన ఆరోపణలు చేశారు.

కాగా.. దీనిపై ఆయన స్పందించారు. తనకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అవసరం లేదని... రోడ్డుపైన కూడా పడుకొని నిద్రపోగలనని చెప్పారు. ఈ సందర్భంగా తాను ప్రతిపక్షాన్ని ఓ విషయం గురించి ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేకపోతే తాను రోజంతా ఎలా పనిచేయగలనని ఆయన ప్రశ్నించారు.ఒక చిన్న బాత్రూమ్ మాత్రమే తన కోసం అధికారులు నిర్మించారని.. దానిని తాను తిరిగి ఇంటికి తీసుకువెళ్లలేనని  చెప్పారు.

శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకున్న ఆయన సాయంత్రం వరకు ప్రజాదర్బార్ నిర్వహించారు. రైతుల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. శనివారం కలబుర్గి జిల్లా అబ్జల్‌పుర తాలూకా హెరూరు గ్రామంలో పల్లెనిద్ర చేపట్టి 23న బెంగళూరుకు ముఖ్యమంత్రి వెనుదిరగనున్నారు.