farmers protest : 2, 3 ఏళ్లలో ప్రధాని మోడీని చంపేస్తాం .. పంజాబ్ రైతు వార్నింగ్ (వీడియో)
పంటకు కనీస మద్ధతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘‘ఢిల్లీ ఛలో’’కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే . అయితే రైతుల ముసుగులో కొందరు ఉగ్రవాదులు నిరసనల్లో పాల్గొంటున్నారు. ఓ వ్యక్తి వచ్చే రెండు మూడేళ్లలో ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు.
పంటకు కనీస మద్ధతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘‘ఢిల్లీ ఛలో’’కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి రైతులు శంభు, ఖనౌరీ ప్రాంతాలకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. గత పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వాటిని తొలగించి ముందుకు సాగాలని రైతులు ప్రయత్నించగా.. వారిపై పోలీసులు భాష్ప వాయు గోళాలు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు.
అయితే దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళన సందర్భంగా ఒక వర్గం రైతుల్లో ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తెరపైకి వచ్చింది. ప్రధానిని బెదిరిస్తూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి, పంజాబ్‌లో అడుగు పెట్టగానే ఆయనకు గుణపాఠం చెబుతారని ఒకరు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు బెదిరింపు స్థాయికి చేరుకుంది. మరో 2-3 ఏళ్లలో ప్రధాని మోదీని చంపేస్తానంటూ రైతులు బహిరంగంగా బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మరో వీడియోలో ఓ వ్యక్తి (ఉగ్రవాదిగా అనుమానితుడు) రైతుల గుంపులో కలిసిపోయి ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని ఇంకా ఎన్నాళ్లు సహిస్తాం.. సాక్షాత్తూ దేశ ప్రధానిని చంపేస్తామంటూ హెచ్చరిస్తున్న వారితో ముప్పు తప్పదని వారు పేర్కొంటున్నారు.
రెండ్రోజుల క్రితం ఇదే రైతుల ఆందోళనల్లో ఓ రైతు కూడా మోడీని బహిరంగంగా బెదిరించాడు. ఆయన మరోసారి పంజాబ్ వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించాడు. మోడీ పంజాబ్ పర్యటనకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ రైతు వ్యాఖ్యానించాడు. క్రితం సారి పంజాబ్ వచ్చినప్పుడు మోడీ తప్పించుకున్నాడని, కానీ ఈసారి వస్తే మాత్రం ఆయనను ఎవ్వరూ రక్షించలేరని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రైతుల ప్రకటనల వెనుక ఇతర శక్తుల ప్రమేయం ఏమైనా వుందా కోణంలో ఆరా తీస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రైతు నిరసనలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. దీని వెనుక రాజకీయ కారణాలు వున్నాయని విపక్షాలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో రైతుల ఆందోళన వెనుక రాజకీయ ఎజెండాను బట్టబయలు చేసింది. మోడీ ప్రజాదరణను తగ్గించేలా వ్యూహం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దాలివాల్ మాట్లాడుతూ. మోడీ ప్రజాదరణ గరిష్ట స్థాయికి చేరుకుందని, అయోధ్య రామమందిరం కారణంగా ఆయన గ్రాఫ్ పెరిగిందన్నారు. మనకు తక్కువ సమయం వుందని, ఆ లోపు మోడీ గ్రాఫ్‌ను తగ్గించాలని జగ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
కాగా.. 12 డిమాండ్లను రైతులు కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. వాటి సాధన కోసం ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. ఈసారి నిరసనకు రైతు సంఘం నాయకులు జగ్జీత్ సింగ్ దల్వాల్, సర్వన్ సింగ్ పంధేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీలు పిలుపునిచ్చాయి. స్వామినాథన్ కమీషన్ నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) హామీ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్లు అందించే పథకాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలని, 2013 నాటి భూసేకరణ చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ నిర్ణయించే రేటుకు 4 రెట్లు పరిహారం ఇవ్వాలని.. లఖింపూర్ ఖేరీ హత్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.