జయలలిత మృతిపై వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ సంచలనం


చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఆమె సన్నిహితురాలు శశికళ దాఖలు చేసిన అఫిడవిట్‌కు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.

తమిళనాడు దివంగత సీఎం జయలలిత వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 2016 సెప్టెంబర్‌ 22న తాను జయలలిత గదిలోకి వెళ్లేటప్పటికి ఆమె అచేతనంగా కుర్చీలో పడి ఉందన్నారు. ఆమె పక్కనే కొన్ని ఫైల్స్‌, మూత లేని పెన్‌ ఉన్నాయని చెప్పారు.

అయితే జయలలిత పక్కనే ఉన్న శశికళ ఒక ఛైర్‌ తీసుకు రమ్మని తనను కోరిందన్నారు. అయితే జయలలిత పీఎస్ఓ పెరుమాళ్ అక్కడకు రావడంతో వెంటనే తామిద్దరం జయలలితను మరో ఛైర్‌లోకి మార్చినట్టు చెప్పారు.

నడవడానికి కూడ జయలలితకు శక్తి లేకుండా పోయిందని చెప్పారు.దీంతో ఆమెను అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి స్ట్రెచర్‌ తీసుకు వస్తే మంచిదని ఆలోచించామని చెప్పారు. అయితే రాత్రి 10గంటల సమయంలో కారు తీసుకు రావాల్సిందిగా వీరపెరుమాళ్‌ తనకు సూచించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆ ఇంటి పనిమనిషి లక్ష్మి వచ్చి పెద్ద కార్‌ తెమ్మని నాతో చెప్పిందన్నారు.

ఈ ఘటన జరగడానికి గంట ముందు రాత్రి 8:30గంటలకు డా. శివకుమార్‌ పోయెస్‌ గార్డెన్‌లో ఉండటం తాను చూసినట్టు ఆయన చెప్పారు. అనంతరం గంటపాటు ఆయన కన్పించ లేదు. తర్వాత నేను అమ్మ గదిలోకి వెళ్లేసరికి శివకుమార్‌ అక్కడే ఉన్నారు. దాదాపు 9:30 ప్రాంతంలో ఆయన అమ్మ గదిలోకి వచ్చి ఉండొచ్చని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

జయలలితను ఆసుపత్రికి తీసుకెళ్లేటపుడు శశికళ, పీఎస్‌వో వీరపెరమాళ్‌ మాత్రమే వెళ్లారని ఆయన చెప్పారు.. పోయెస్‌ గార్డెన్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ ఘటనంతా రికార్డయ్యిందో లేదో తెలియదని అని కన్నన్‌ తెలిపారు.అయితే శశికళ, డాక్టర్ శివకుమార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం జయలలిత బెడ్‌ మీద కూర్చొని ఉండగానే స్పృహ కోల్పోయి పడిపోయినట్టుగా పేర్కొన్నారు.