ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హీట్ నడుస్తోంది. దేశ ప్రధాని ఎవరు అవుతారు..? అధికారం ఏ పార్టీకి దక్కుతుంది? ఎక్కడ చూసినా ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. మరో మూడు రోజులు ఆగితేగానీ గెలుపు ఎవరిదో తేలదు. కాగా... ఈ ఎన్నికల హీట్ ని ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జొమాట్ అవకాశంగా తీసుకుంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. కాబోయే ప్రధాని ఎవరో చెప్పిన వారికి 30శాతం డిస్కౌంట్ ఇస్తానని ప్రరకటించింది.

జెఈఎల్(ZEL) పేరుతో జొమాటో ఎలక్షన్ లీగ్ అని దీనికి నామకరణం చేశారు. ఇందులో మన దేశ తర్వాతి ప్రధాని ఎవరో కరెక్ట్‌గా ఊహించిన వారికి 30 శాతం క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అంటే మీ అంచనా నిజమైతే.. ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసే ఫుడ్‌లో 30 శాతాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పొందొచ్చు.

 ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌తో పాటు ఈ గేమ్ ఆడొచ్చు. గెలిస్తే.. 23వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వాడుకోవచ్చు. ఇది ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో ఇస్తున్న 40 శాతం డిస్కౌంట్‌కు అదనంగా ఇస్తామని జొమాటో ప్రకటించింది.

మొన్నటి వరకు ఐపీఎల్ లో ఇదే రకమైన పోటీ పెట్టింది జొమాటో. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు..? ఐపీఎల్ విన్నర్ ఎవరూ అనే ప్రశ్నలతో గేమ్ నిర్వహించింది. దానికి రెస్పాన్స్ భారీగా రావడంతో ఇప్పుడు ఎలక్షన్స్ ని కూడా ఇదే విధంగా ఉపయోగించుకుంటోంది. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం ఇదో కొత్త టెక్నిక్.