చెన్నై: తమ పార్టీ డిఎంకెతో టచ్ ఉందని తమిళనాడు బిజెపి ప్రెసిడెంట్ తమిలిసాయి సౌందరరాజన్ అన్నారు. కేంద్రంలో బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఆమె ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ఓ వ్యక్తితో వారు మాట్లాడుతున్నారని, సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని, కేంద్రంలో బిజెపి గెలుస్తుందని అన్ని అంచనాలు చెబుతున్నాయని, ఎక్కడికి వెళ్లినా బిజెపి గెలుస్తోందనే మాటనే వినిపిస్తోందని ఆమె అన్నారు. 

కేంద్రంలో బిజెపియేతర, కాంగ్రెసేతర తృతీయ ఫ్రంట్ కు అవకాశం లేదని, అయితే ఆ విషయంపై మే 23వ తేదీ తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని స్టాలిన్ చెప్పిన మాటకు ఆమె ప్రకటనకు పొంతన లేదు.

తాను బిజెపితో టచ్ ఉన్నట్లు మోడీ గానీ తమిలిసాయి గానీ రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్టాలిన్ అన్నారు. నిరూపించలేకపోతే ఆమె, మోడీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అడిగారు. తమిలిసాయి ప్రకటనను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు.