న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను మరింత బలోపేతం చేసే దిశగా యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అడుగు ముందుకేశారు. ప్రదాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్దీఎకు చెక్ పెట్టేందుకు ఆమె రంగంలోకి దిగారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలకు, ఎన్డీఎయేతర పార్టీలకు ఆమె లేఖలు రాశారు. 

భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి మే 23వ తేదీన నిర్వహిస్తున్న సమావేశానికి సోనియా ఆ పార్టీల నేతలను ఆహ్వానిస్తూ లేఖలు రాశారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా తీర్పు తర్వాత యుపిఎ భాగస్వామ్య పక్షాలు, ఎన్డిఎయేతర పక్షాలు ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు .

ప్రజా తీర్పు ఎన్డిఎకు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు తమ సమావేశం రోడ్ మ్యాప్ వేసే దిశగా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. ఎన్డీఎలో గానీ యుపిఎలో గానీ భాగస్వాములు కాకుండా తటస్థంగా ఉన్న పార్టీలను కూడా సోనియా గాంధీ 23వ తేదీ సమావేశానికి ఆహ్వానించారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో స్వయంగా మాట్లాడి 23వ తేదీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ 23వ తేదీ సమావేశానికి హాజరు కావడమనేది ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.