న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అధిక లోకసభ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ను దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా ఉన్నప్పటికీ కేంద్రం హంగ్ తప్పదనే అభిప్రాయంతో కాంగ్రెసు ఉంది.

దాంతో కాంగ్రెస్‌ నేతలు ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగించారు. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ అసెంబ్లీ, ఎంపీ సీట్లు వైసీపీకి దక్కుతాయని జాతీయ చానెళ్ల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఎన్డీయేతర కూటమిలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

జగన్‌కు ఆదివారం ఓ కాంగ్రెస్‌ నేత ఫోన్‌ చేసి ఎన్డీయేతర కూటమికి మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా జగన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఆయన జగన్‌ను సోమవారం కోరారు. అయితే, ఏ విషయమైనా ఫలితాలు వచ్చిన తర్వాతే చెబుతానని జగన్‌ స్పష్టం చేశారు.