న్యూఢిల్లీ: లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగాయి.

95 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. మొత్తం 1,611మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గురువారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

 

గురువారం నిర్వహించిన 2వ దశ ఎన్నికల్లో 61.12శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రాలవారీగా వివరాలు పై విధంగా ఉన్నాయి.

కాగా, మధురైలో మీనాక్షీ సుందరేశ్వరర్ ఆలయంలో ప్రత్యేక కారు ఫెస్టివల్ కారణంగా గురువారం నాటి పోలింగ్ రాత్రి 8గంటల వరకు జరగనుంది.

గురువారం మధ్యాహ్నం 3గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్:
మహారాష్ట్ర - 46.63శాతం
తమిళనాడు - 52.02శాతం
ఒడిశా - 53శాతం
మణిపూర్ - 67.5శాతం
ఉత్తరప్రదేశ్ - 50.39శాతం
ఛత్తీస్‌గఢ్ - 59.72శాతం
కర్ణాటక - 49.26శాతం

 

ఆస్పత్రి నుంచి స్ట్రెచర్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన యువతి. ఇటీవల ఆమెకు ప్రమాదం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఓటును వినియోగించుకోవాలనే తపనతో ఇలా స్ట్రెచర్‌పైనే వచ్చింది.

కర్ణాటక: పద్మ అవార్డు గ్రహీత, 107ఏళ్ల సాలుమరద తిమ్మక్క బెంగళూరు రూరల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మణిపూర్: ఇంఫాల్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసుందుకు క్యూలో నిలబడిన ప్రజలు.

- పశ్చిమబెంగాల్: మధ్యాహ్నం 3గంటల వరకు జల్పాయిగురి(ఎస్సీ)-71.32శాతం, డార్జిలింగ్-63.14, రాయ్‌గంజ్-61.84శాతం, రాష్ట్ర వ్యాప్తంగా-65.43శాతం పోలింగ్ నమోదైంది.

అస్సాం: నాగౌన్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ప్రజలు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్‌లో ఎన్నికల సంఘం అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

- ఒడిశా: గంజాంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన 95ఏళ్ల వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్దరించారు.

- కర్ణాటక: మాండ్యా స్థానం నుంచి పోటీ చేస్తున్న సుమలత అంబరీష్, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడ వర్గీయుల మధ్య పోలింగ్ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

- ఉత్తరప్రదేశ్: బులంద్‌షహర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ బోలా సింగ్ చేతికి పార్టీ గుర్తయిన కమలం బ్యాడ్జీ కట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నంచారు. దీంతో ఆయన ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు.

- జమ్మూకాశ్మీర్: బుద్గాం జిల్లాలోని హఫ్రూ గ్రామంలో పలువురు నిరసనకారులు ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆయన కుటుంబసభ్యులు రాజ్‌నంద్‌గాం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- ఇన్నర్ మణిపూర్ పీసీలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో కొంతమంది దూసుకెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. కాగా, మిగితా 19 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

పశ్చిమబెంగాల్: ఛోప్రాలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఈవీఎం ఒకటి ధ్వంసమైంది. 

ఫతేపూర్‌సిక్రి: తమకు నీటి వసతి కల్పించడం లేదంటూ మంగోలి కాలా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. 

- తమిళనాడు: తిరువల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని నాగరాజ కండిగయి గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు. స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం ఏర్పడుతోందని ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రామస్తులను కోరినప్పటికీ వారు ముందు రావడం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

- పశ్చిమబెంగాల్: రాయ్‌గంజ్ నియోజకవర్గంలోని ఛోప్రాలో దుండగులు క్రూడ్ బాంబులతో విరుచుకుపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అసాంఘిక శక్తులు ఎక్కువయ్యాయని, గతంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ హత్యకు గురయ్యారని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకుండా.. పోలీసులు అధికార టీఎంసీకే మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే నిరసనలు
చేపడతామని అన్నారు.


అమెరికాలో ఉన్న సద్గురు జగ్గీవాసుదేవ్ 17గంటలు ప్రయాణించి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోయంబత్తూరుకు చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ పోలింగ్‌లో పాల్గొని యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
 

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ దొడ్డ హలహళ్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఛత్తీస్‌గఢ్: ఎన్నికల వేళ మావోయిస్టులు పేలుళ్లకు తెగబడ్డారు. కోరచా, మణ్‌పూర్ రోడ్ మధ్య రాజ్‌నంద్‌గాంలో ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఉదయం 11గంటలకు జరిగిన ఘటనలో ఐటీబీపీ కానిస్టేబుల్ మన్ సింగ్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అపాయం ఏమి లేదని అధికారులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

పశ్చిమబెంగాల్:  రాయ్‌గంజ్ సీపీఎం అభ్యర్థి మొహమ్మద్ సలీమ్ వాహనంపై ఇస్లాంపూర్‌లో దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనని సీపీఎం ఆరోపించింది.

కర్ణాటక: మైసూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య.

ఫేక్ ఓటింగ్ జరుగుతోందని అమ్రోహా బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ ఆరోపించారు. బుర్ఖాలో వచ్చే మహిళలను తనిఖీ చేయకుండానే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారని అన్నారు. అంతేగాక, బుర్ఖాలో ఓ పురుషుడు వచ్చి ఓటేసేందుకు ప్రయత్నించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.

- జమ్మూకాశ్మీర్‌లో గురువారం ఉదయం 11గంటల వరకు 17.8శాతం పోలింగ్ నమోదైంది.

మహారాష్ట్ర: బుల్దానాలోని 193 పోలింగ్ బూత్‌లో పనిచేసే ఎన్నికల అధికారులంతా ప్రత్యేక వైకల్యం కలిగినవారే కావడం గమనార్హం. దివ్యాంగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారి పిలుపునిచ్చారు.

పశ్చిమబెంగాల్: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ అర్ష(పురులియా) సేనబన గ్రామంలో బీజేపీ యువ మోర్చా సభ్యుడు శిశుపాల్ సాహిస్(22) ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- గురువారం ఉదయం 11గంటల వరకు కర్ణాటకలో 19.81శాతం, ఒడిశాలో 18శాతం, పశ్చిమబెంగాల్‌లో 33.45శాతం ఓటింగ్ నమోదైంది.

- గురువారం ఉదయం 11గంటల వరకు తమిళనాడులో 30.62శాతం పోలింగ్ నమోదైంది.

కర్ణాటక: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తేజశ్విని అనంత్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

జమ్మూకాశ్మీర్: శ్రీనగర్ మున్షిభాగ్ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘం వీలు కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

- పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో అల్లరిమూకలు రాళ్లు రువ్వుతూ రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు.

- గురువారం ఉదయం 11 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో 24.31శాతం ఓటింగ్ నమోదైంది.

- గురువారం ఉదయం 11గంటల వరకు బీహార్‌లో 18.97శాతం పోలింగ్ నమోదైంది.

 

 పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో అల్లరిమూకలు రాళ్లు రువ్వుతూ రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు పోలీసులు.

- పశ్చిమబెంగాల్‌లోని ఇస్లాంపూర్‌లో టీఎంసీ కార్యకర్తలు ఓ పోలింగ్ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఓటర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు.

నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, నాందేడ్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్.

- ఉదయం 11 గంటల వరకు మణిపూర్‌లో 32.18శాతం పోలింగ్ నమోదైంది.

పశ్చిమబెంగాల్: రాయ్‌గంజ్ కోరోనేషన్ హై స్కూల్‌లోని పోలింగ్ బూత్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జనరల్ సెక్రటరీ, రాయ్‌గంజ్ నియోజకవర్గం అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. అంతేగాక, అక్కడున్న ముస్లింల వద్ద ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.

- టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

మహారాష్ట్ర: సోలాపూర్ శాస్త్రినగర్‌లోని బూట్ నెంబర్ 217లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ తాత్కాలిక నిలిచిపోయింది.

కర్ణాటక: మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్‌డీ దేవేగౌడ దంపతులు పడువలహిప్పేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

 ప్రముఖ సినీనటులు సూర్య, జ్యోతిక దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బీహార్: కేంద్రమంత్రి, బక్సర్ బీజేపీ అభ్యర్థి అశ్వినీ కుమార్ చౌబే భగల్పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీహార్‌లో గురువారం ఉదయం 10గంటల వరకు 19.5శాతం ఓటింగ్ నమోదైంది.

మథుర: యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఫతేపూర్ సిక్రీ అభ్యర్థి రాజ్ బబ్బర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జమ్మూకాశ్మీర్: దోడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్న ప్రజలు.

జమ్మూకాశ్మీర్: 80ఏళ్ల జోగిందరో దేవి అనే మహిళా పేషెంట్ కథువా జిల్లా ఆస్పత్రి నుంచి ఓటు వేసేందుకు వస్తున్న దృశ్యం.

కర్ణాటక: 91ఏళ్ల శ్రీనివాస్, 84ఏళ్ల మంజుల అనే వృద్ధ దంపతులు బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించి యువ ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు.

తమిళనాడు: ఓటు వేసిన అనంతరం అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం(ఎఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్.

బీహార్: భగల్పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న 90ఏళ్ల మహిళలు ఊర్మిళ, ఉష.

జమ్మూకాశ్మీర్: వాలివార్ సీ పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో ప్రజలు. 

జమ్మూకాశ్మీర్: ఉధంపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓట హక్కును వినియోగించుకున్న నవ దంపతులు.

తమిళనాడు: చెన్నై తేనంపేట్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.

కర్ణాటక: సీఎం హెచ్‌డీ కుమారస్వామి, తన సతీమణి అనితా కుమారస్వామి, కొడుకు నిఖిల్(మాండ్య అభ్యర్థి) రామనగరలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇంఫాల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్.

కర్ణాటక: శేషాద్రిపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ. 

కర్ణాటక: కొరటగిరిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కర్ణాటక డీప్యూటీ సీఎం జీ పరమేశ్వర దంపతులు.

తమిళనాడు: చెన్నైలోని అవర్పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తుత్తుకుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి. 

రెండో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మాజీ కేంద్రమంత్రి చిదంబరం.

మథుర: గంథోలి గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం సరిగా పనిచేయకపోవడంతో తమ ఓట హక్కును వినియోగించుకునేందుకు క్యూలోనే నిల్చున్న ప్రజలు. 

బీహార్: కతిహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రం ముందు కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘చేయి’ని బ్యానర్‌గా కట్టిన దృశ్యం.

కర్ణాటక మంత్రి హెచ్ డీ రేవన్న తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

పుదుచ్చేరిలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తమిళనాడులోని మక్కల్ నీధీ మైమ్ చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ తన కూతురు శ్రుతి హాసన్ తో కలిసి చెన్నైలోని ఆల్వార్ పేట కార్పోరేషన్ స్కూల్ లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం నెంబర్ 27లో తమ ఓటేశారు. 

 

కర్ణాటకలోని బెంగళూర్ సెంట్రల్ స్వతంత్ర అభ్యర్థి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్నారు.

 

మహారాష్ట్రలోని షోలాపూర్ లోని 164వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత తన గర్భవతి భార్యతో కలిసి ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకున్నాడు.

 

పశ్చిమ బెంగాల్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు బారులు తీరారు. డార్జిలింగ్ లో ఓటు వేయడానికి ప్రజలు పెద్ద యెత్తున ఆసక్తి కనబరిచారు.

 

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్యూలో నిలబడి సేలంలోని ఎడపడి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఇంపాల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

అస్సాంలోని సిల్చార్ లో గల 200 నెంబర్ పోలింగ్ బూత్ లో వీవీ ప్యాట్లు సరిగా పనిచేయలేదు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం వీవీప్యాట్ సరిగా పనిచేస్తోందని, ప్రజలు ఓటు వేయవచ్చునని సెక్టార్ అధికారి సహదత్ అలీ చెప్పారు.

 

కర్ణాటకలోని బెంగళూర్ సౌత్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటేశారు. జయనగర్ లోని 54వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు వేశారు.
 

దేశంలో లోకసభ ఎన్నికలకు రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తమిళనాడులో సినీ స్టార్స్ ఓటు వేయడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. రజినీకాంత్ మాత్రమే కాకుండా అజిత్ కూడా తన ఓటు హక్కును వాడుకున్నారు.

 

తమిళనాడులో నళిని చిదంబరం, కార్తి చిదంబరం, ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్ శివగంగలోని కరైకుడిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

కాంగ్రెసు నేత సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ లోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

తమిళనాడులోని చెన్నైలో గలస్టెల్లా మేరీ పాఠశాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివగంగలో కేంద్ర మంత్రి పి. చిదంబరం ఓటేశారు.
 

లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా 95 స్థానాల్లో గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో ఉన్న ఆ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

జమ్మూకాశ్మీర్: దోడ ప్రాంతంలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైన దృశ్యం.