జామ్ నగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి, సోదరి గుజరాత్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నెల రోజుల క్రితమే ఆయన భార్య బిజెపిలో చేరారు. పటిదార్ నేత హార్డిక్ పటేల్ సమక్షంలో జడేజా తండ్రి, సోదరి ఆదివారంనాడు కాంగ్రెసు పార్టీలో చేరారు. 

జామ్ నగర్ జిల్లాలోని కలవాడ్ నగరంలోని ఎన్నికల ర్యాలీలో జడేజా తండ్రి అనిరుద్ సిన్హ్, సోదరి నైనాబా కాంగ్రెసు పార్టీలో చేరారు. జడేజా జామ్ నగర్ కు చెందినవారు. ఆయన తండ్రీసోదరి కాంగ్రెసులో చేరిన కార్యక్రమంలో జామ్ నగర్ లోకసభ సీటు కాంగ్రెసు అభ్యర్థి ములు కండోరియా కూడా పాల్గొన్నారు. 

ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా భార్య రివాబా మార్చి 3వ తేదీన బిజెపిలో చేరారు. బిజెపి ఎంపి, ప్రస్తుత అభ్యర్థి పూనంబెన్ మాదాం సమక్షంలో ఆమె బిజెపిలో చేరారు. 

కాంగ్రెసు తరఫున జామ్ నగర్ నుంచి హార్దిక్ పటేల్ పోటీ చేయాలని అనుకున్నారు. రెండేళ్లు జైలు శిక్ష పడిన కేసును తనపై ఎత్తివేయాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన పోటీ చేసే అవకాశాలు సన్నగిల్లాయి. గుజరాత్ లోకసభ ఎన్నికల పోలింగ్ మూడో దశలో ఏప్రిల్ 23వ తేదీన జరుగనుంది.