న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేస్తున్న కాంగ్రెసు కొత్త వ్యూహానికి తెర తీసింది. బిజెపి బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహం ఇది.

పార్టీ వ్యూహంలో భాగంగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయ్ నాడు నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ప్రియాంక గాంధీ కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, ఈ విషయం ఇప్పటి వరకు ప్రచారంలో మాత్రమే ఉంది.

గతంలో ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందిరా గాంధీ చిక్ మంగళూరు నుంచి పోటీ చేశారు. అదే విధంగా సోనియా గాంధీ గతంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేశారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీట్లపై ఎక్కువ దృష్టి పెట్టకూడదని కాంగ్రెసు భావిస్తున్నట్లు సమాచారం. బిఎస్పీ, ఎస్పీ కూటమి బిజెపికి బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో తాము ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల బిజెపి లాభపడే సూచనలు కనిపిస్తాయని అనుకుంటున్నట్లు సమాచారం. 

ఎస్పీ, బిఎస్పీ అవసరమైతే కేంద్రంలో తమతో కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, తమ మిత్రులు తక్కువగా, బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెసు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.