అండిపట్టి: తమిళనాడులోని తేనీ నియోజకవర్గం అండిపట్టిలో ఆదాయం పన్ను శాఖ అధికారులు లెక్క చెప్పని రూ.1.48 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.  అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం (ఎఎంఎంకె) నాయకుడిపై సోమవారంనాడు ఐటి దాడులు జరిగాయి. 

ఐటి అధికారులు వార్డు నెంబర్లు, ఓటర్ల సంఖ్యలతో పాటు నగదు ఉన్న 94 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కింగ్ ను బట్టి ఓటరుకు రూ.300 చొప్పున పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. 

ఆదాయం పన్ను, ఎన్నికల కమిషన్ అధికారులతో తొలుత ఎఎంఎంకె కార్యకర్తలు గొడవ పడ్డారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఐటి అధికారుల సోదాలు రాత్రి నుంచి మంగళవారం ఉదయం 5.30 గంటల వరకు సాగాయి. తమిళనాడులో గురువారం పోలింగ్ జరగనుంది.

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి