న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు  ఈసీ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సిద్దూను ఎన్నికల ప్రచారం నుండి 72 గంటల పాటు నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

మంగళవారం నాడు ఉదయం 10 గంటల నుండి సిద్దూపై విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. సిద్దూ ఈ నెల 16వ తేదీన బీఆర్ రాష్ట్రంలోని కటిహార్ ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో ముస్లిం ఓట్లు చీల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముస్లింలు ఏకమై మోడీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేత తారిఖ్ అన్వర్‌కు మద్దతుగా  ప్రచారం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.  దీంతో  సిద్దూ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఎన్నికల ప్రచారంలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేసినందుకుగాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌పై మూడు రోజులు బీఎస్పీ చీఫ్ మాయావతిపై రెండు రోజులు ఎస్పీ  నేత ఆజంఖాన్‌పై  ఎన్నికల కమిషన్  ప్రచారం చేయకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి మేనకాగాంధీపై కూడ  ఈసీ నిషేధం విధించింది.