తీవ్రంగా హెచ్చరించినందునే భారత పైలెట్‌ అభినందన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం నాడు గుజరాత్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన  ప్రసంగించారు. 


హైదరాబాద్: తీవ్రంగా హెచ్చరించినందునే భారత పైలెట్‌ అభినందన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం నాడు గుజరాత్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.

గుజరాత్ రాష్ట్రంలోని పాటణ్, రాజస్థాన్‌లోని చితోడ్‌గఢ్, బర్మేర్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాకిస్థాన్‌పై జరిగిన వైమానిక దాడుల గురించి ఆయన వివరించారు. భారత పైలెట్ అభినందన్ పాక్‌కు చిక్కిన సమయంలో సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి పాక్‌ను గట్టిగా హెచ్చరించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

భారత పైలెట్‌కు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు ఆయన చెప్పారు. పరిస్థితుల్లో విషమంగా ఉన్నాయని అమెరికా ప్రకటించిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

ప్రధాన పదవి ఉండొచ్చు.. పోవచ్చు కానీ దేశంలో ఉగ్రవాదులు ఉండకూడదని తాను నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి ఓటు వేయడమంటేనే ఉగ్రవాదాన్ని అంతం చేయడమేనని ఆయన చెప్పారు.

అణ్వాయుధాలు ఉన్నాయని పాక్ చేసిన బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. తాము నిబంధనలను పాటిస్తామన్నారు.కానీ, అదే సమయంలో దేశ భద్రత చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.