న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను తయారు చేసేందుకు బీజేపీ కోర్ కమిటీ వచ్చే వారంలో సమావేశం కానుంది.ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీలకు మరో సారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే సిట్టింగ్‌లకు ఎంపీ టిక్కెట్టును ఇవ్వడాన్ని కొందరు బీజేపీ జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు.

సర్వే రిపోర్టుల ఆధారంగా  టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని  బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే అదే సమయంలో ఆయా జిల్లాల్లోని  బీజేపీ కోర్ కమిటీ ఫీడ్‌బ్యాక్ కూడ తీసుకోవాలని భావిస్తున్నారు.

చామరాజనగర, మాండ్యా, బెంగుళూరు రూరల్, చిక్‌బళ్లాపూర, కోలార్, తుమకూరు, చిత్రదుర్గ, కొప్పాల్, కలాబుర్గీ, బల్లారి, చిక్కోడీ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేసే సమయంలో  ఆయా జిల్లాల పార్టీ ఆఫీస్ బేరర్లు,  కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను తీసుకొంటామని  బీజేపీ నేత ఒకరు ప్రకటించారు.

తన అనుయాయులకు మరోసారి ఎంపీ టిక్కెట్లను కట్టబెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. శోభ , నలినీకుమార్ కటీల్‌లకు స్థానికంగా పార్టీ నేతల నుండి తలనొప్పులు ఉన్నాయి. అయినా వీరినే మరోసారి ఈ స్థానాల్లో బరిలోకి దింపాలని యడ్యూరప్ప కోరుతున్నారు.

చిక్కోడి నుండి మరోసారి రమేష్ కట్టిని బరిలోకి దింపడాన్ని స్థానిక బీజేపీ నేతలు భావిస్తున్నారు. అతను 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. డీఎస్ వీరయ్య కోలార్ నుండి, మాజీ ఎంపీ బస్వరాజ్ తుమకూరు నుండి పోటీ చేయనున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన  రమేష్ ఒకవేళ బీజేపీలో చేరితే ఆయనను కలబురిగీ నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరే బెలగావి నుండి టిక్కెట్టు ఆశిస్తున్నట్టు సమాచారం.  మరో వైపు జయప్రకాష్ హెగ్డే ఉడిపి టిక్కెట్టును ఆశిస్తున్నారు.