Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో కొలిక్కి రాని సర్దుబాటు: మరో 3 సీట్ల కోసం కుమారస్వామి పట్టు

కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. కర్ణాటకలో మొత్తం 28 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో జెడిఎస్ 12 లోకసభ స్థానాలను అడుగుతుండగా, 9 మాత్రమే ఇస్తామని కాంగ్రెసు చెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

JD(S) demands 12 LS seats, Congress says will give nine
Author
Bengaluru, First Published Mar 5, 2019, 12:11 PM IST

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. కర్ణాటకలో మొత్తం 28 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో జెడిఎస్ 12 లోకసభ స్థానాలను అడుగుతుండగా, 9 మాత్రమే ఇస్తామని కాంగ్రెసు చెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

సోమవారం ఇరు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో మంగళవారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర నాయకుల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత జాబితాను ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, జెడిఎస్ అధినేత దేవెగౌడకు ఆమోదం కోసం సమర్పిస్తారు.

సీట్ల సర్దుబాటుపై సోమవారం కుమార కృప అతిథి గృహంలో జరిగిన చర్చలకు ముఖ్యమంత్రి కుమారస్వామి, జెడిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అయిన కర్ణాటక వ్యవహారాల ఇంచార్జీ కెసి వేణుగోపాల్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. 

సీట్ల సర్దుబాటు వ్యవహారం మార్చి 10వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని సిద్ధరామయ్య సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు. అన్ని లోకసభ స్థానాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచిన సీట్లను కొన్నింటిని కూడా జెడిఎస్ అడుగుతోందని ఆయన చెప్పారు. కూటమి కనీసం 20 సీట్లను గెలుచుకునే విధంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని అన్నారు. 

మాండ్యా, శివమొగ్గ సీట్లకు కుమారస్వామి తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. దానికి జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఆమోద ముద్ర అవసరమని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios