అమలాపురం: ఇటీవలే పార్టీలో చేరిన మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. అమలాపురం లోకసభ సీటును ఆశించి హర్షకుమార్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపిలో చేరారు. అయితే, అనూహ్యంగా ఆయనకు టికెట్ దక్కలేదు. అమలాపురం లోకసభ స్థానానికి దివంగత నేత జిఎంసి బాలయోగి తనయుడు హరీష్ మాథుర్ కు ఇచ్చారు. 

దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన హర్షకుమార్ గురువారం టీడీపికి రాజీనామా చేశారు. టీడీపిలో చేరిన సమయంలో హర్షకుమార్ చంద్రబాబు కాళ్లకు మొక్కడాన్ని దళిత సంఘాలు జీర్ణించుకోలేక పోయాయి. ఆయనపై దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. 

తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు హర్షకుమార్ గురువారంనాడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని ఆయన సవాల్  విసిరారు. 

జనసేన, కాంగ్రెస్‌, బీఎస్పీ, టికెట్లను టీడీపీ ఫిక్స్‌ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండని ఆయన  తన అనుచరులకు పిలుపునిచ్చారు.